గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం : జిల్లాలో జూన్ నుంచి చెరువుల అనుసంధానం పథకాన్ని ప్రారంభించనున్నట్టు కలెక్టర్ నాయక్ తెలిపారు. మంగళవారం ఆయన గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురాలలో విలేకరులతో మాట్లాడారు. నీరు చెట్టు కార్యక్రమం ద్వారా జిల్లాలో 1500 చెరువులను అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. 27 పెద్ద చెరువులను పొక్లయినర్లతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. దీనిలో భాగంగా జిల్లాలో చైన్‌ఆఫ్ ట్యాంకు(చెరువుల అనుసంధానం) పథకాన్ని అమలు చేయనున్నట్టు చెప్పారు. ఈ పథకం కింద గ్రామాల్లో ఉన్న ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీరు మళ్లిస్తూ పంటపొలాలకు నీరును అందించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఒక మండలంలోని సుమారు ఐదు చెరువులను కలిపి చైన్ ఆఫ్ ట్యాంకు పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. జిల్లాకు లక్షా 36వేల మరుగుదొడ్లు మంజూరయ్యాయని తెలిపారు. గుమ్మలక్ష్మీపురం వైటీసీలో మరి కొద్ది రోజుల్లో గిరిజన, గిరిజనేతర నిరుద్యోగ యువతకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నాయక్ తెలిపారు.
నీటి ఎద్దడి లేకుండా చర్యలు
రానున్న వేసవిలో జిల్లాలో ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లాలో ఇప్పటికి ఎటువంటి తాగునీటి సమస్య లేదన్నారు. అయినా జిల్లాలో ఉన్న 18వేల బోర్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామని, ఎక్కడైనా నీటి ఎద్దడి ఏర్పడితే, ఆయా ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. పార్వతీపురం సబ్‌ప్లాన్‌లో నీటి ఎద్దడి లేకుండా ఐటీడీఏ పీఓ చర్యలు చేపట్టారన్నారు. కలెక్టర్ కార్యాలయంతోపాటు ఐటీడీఏ కార్యాలయంలో మానటరింగ్‌సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఐఏపీ నిధులతో వైసీటీల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో పది యానిమల్ హాస్టళ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. జెడ్పీకి 13వ ఆర్థిక సంఘ నిధులు రూ. 10కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.
అలాగే పీడీఎస్ బియ్యం రీసైక్లిన్‌పై చర్యలు చేపట్టామన్నారు. తోటపల్లి నిర్వాసితుల పట్ల సానుకూలంగా స్పందిస్తామని, వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. నాగావ ళిలో కలుషితనీరు ప్రవహిస్తోందని, దీనికి ఒడిశాకు చెందిన కొన్ని పరిశ్రమలు కారణమని, ఆ నీటిని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించి రాయగడ కలెక్టర్‌తో మాట్లాడతామన్నారు. ఉపాధికి సంబంధించి బిల్లులు మంజూరయ్యాయన్నారు. పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి స్థలం, నిధులు, అంబులెన్స్‌లు సమకూరుస్తామన్నారు. అలాగే పీహెచ్‌సీలు తదితర నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ శ్రీకేశ్ బి లఠ్కర్, ఆర్డీఓ రోణంకి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
జూన్ నుంచి చెరువుల అనుసంధానం
Published Wed, Mar 11 2015 2:28 AM | Last Updated on Thu, Mar 21 2019 8:16 PM
Advertisement
Advertisement