గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో గాయాలపాలై చికిత్స పొందుతున్న విద్యార్థి గాయం ...
జగ్గయ్యపేట : గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో గాయాలపాలై చికిత్స పొందుతున్న విద్యార్థి గాయం నాగార్జునరెడ్డి (14) సోమవారం తెల్లవారు జామున మృతిచెందాడు. ఈ నెల 20న కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు శివారులో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్ర గాయాలపాలైన నాగార్జునరెడ్డిని గుర్తించిన పోలీసులు మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ తీసుకెళ్లారు. 80 శాతం శరీరం కాలిపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు నాగార్జునరెడ్డి తెలంగాణ రాష్ట్రం మేళ్లచెరువు మండలం తమ్మవరం గ్రామపంచాయతీ శివారు కొత్తూరు గ్రామానికి చెందిన గాయం నర్సిరెడ్డి కుమారుడు.
హుజూర్‌నగర్‌లోని చైతన్య పబ్లిక్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతూ అదే పాఠశాల హాస్టల్‌లో ఉన్నాడు. ఈ నెల 18వ తేదీ ఉదయం బయటకు వచ్చిన నాగార్జునరెడ్డి తిరిగి హాస్టల్‌కు వెళ్లకపోవడంతో వార్డెన్ సమాచారం మేరకు అతని తల్లిదండ్రులు హుజూర్‌నగర్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడ అదృశ్యమైన విద్యార్థి శనివారం ఉదయం చిల్లకల్లు గ్రామంలోని జాతీయరహదారి పక్కన పెట్రోలు బంక్ సమీపంలో వంటిపై మంటలు చెలరేగుతూ కనిపించిన విషయం విదితమే.