టీఆర్ఎస్ ఓటమి అంగీకరించినట్టే: పొన్నాల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే. చంద్రశేఖరరావుపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ నేతలను సన్యాసులని తిట్టడం కేసీఆర్ దురహంకారానికి నిదర్శనం అని పొన్నాల అన్నారు. సన్యాసులకు అధికారం అప్పగించవద్దని ప్రజలను కోరడమంటే టీఆర్ఎస్ ఓటమిని అంగీకరించినట్లే అని పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు.
జలయజ్ఞంలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తున్న కేసీఆర్.. నాడు టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న కడియం శ్రీహరే దేవాదుల ప్రాజెక్ట్కు 10శాతం మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారని పొన్నాల అన్నారు. ఇప్పుడు మీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న కడియంను తప్పుపట్టమంటే ఏమంటావ్ కేసీఆర్ అంటూ పొన్నాల ప్రశ్నించారు.