కాకినాడ: విద్యుత్ కోతలు మళ్లీ మొదలైయ్యాయి. వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న పాలకులకు వాస్తవంలో మాత్రం విద్యుత్ సమస్యలపై శ్రద్ధ చూపడం లేదు. తాజాగా కాకినాడ నగరంలో సోమవారం ఆరు గంటల పాటు విద్యుత్ కోత విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు. ఎమర్జెన్సీ లోడు పేరుతో విద్యుత్ కోతలు విదిస్తున్నట్లు నగర వాసులు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉండగా, మెదక్ జిల్లాలోని ర్యాలమడుగు గ్రామంలో నెలరోజుల నుంచి కరెంటు కోతల సమస్య అధికమైంది. సరఫరా ఎప్పుడుంటుందో...ఎప్పుడు ఉండడం లేదో తెలియని పరిస్థితి. దీంతో వ్యవసాయ బోర్లు కూడా పనిచేయకపోవడంతో లక్షల రూపాయలు పెట్టుపడిపెట్టి సాగుచేస్తున్న పంటలు ఎండిపోతున్నాయి. విషయాన్ని ట్రాన్స్‌కో ఉన్నతాధికారులకు తెలిపినా ఫలితం లేకపోవడంతో రైతులంతా ఆగ్రహంతో ఉన్నారు. ఇదే సమయంలో శనివారం కొందరు ట్రాన్స్‌కో అధికారులు బిల్లుల వసూళ్లకు గ్రామానికి వచ్చారు. అప్పటికే ట్రాన్స్‌కో పనితీరుపై కోపంగా ఉన్న రైతులు, గ్రామస్థులు వారిని పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. బిల్లులు సక్రమంగా చెల్లిస్తున్నా, కోతలు ఎందుకు విధిస్తున్నారంటూ ప్రశ్నించారు. సమయం, సందర్భం లేని కరెంటు కోతలతో పంటలు ఎండిపోయాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు వచ్చి అప్రకటిత కరెంటు కోతలుండవని స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకూ అధికారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.