
సేవల్లో జాప్యానికి చెక్
విజయనగరం మున్సిపాలిటీ : విద్యుత్ సేవల్లో జాప్యానికి చెక్ పెట్టి వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ సి.శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. ఇందులో భాగంగా 18004255533 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా ఇకపై తక్షణ సేవలందించనున్నట్టు చెప్పారు. వినియోగదారులు తమ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను టోల్‌ఫ్రీ నంబర్‌కు తెలియజేస్తే అధికారులు తక్షణమే స్పందించి నిర్ణీత సమయంలోగా సమస్యను పరిష్కరిస్తారన్నారు. ఈ విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేపడుతున్నామని, వినియోగదారులు గ్రహించి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్థానిక దాసన్నపేట విద్యుత్ భవనంలో టోల్‌ఫ్రీ నంబర్‌పై పోస్టర్లను ఆయన గురువారం ఆవిష్కరించారు.
ఇప్పటి వరకు విద్యుత్ వినియోగదారులు చిన్నపాటి సమస్యలైన ఫ్యూజ్ ఆఫ్ కాల్స్ నుంచి పెద్ద సమస్యలైన ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు, నూతన విద్యుత్ కనెక్షన్‌ల మంజూరు తదితర సమస్యల పరిష్కారానికి సంబంధించి జేఎల్‌ఎం, ఏఈలకు ఫిర్యాదు చేసేవారిన్నారు. అయితే వారు చెప్పిన సమస్యలను శాఖ సిబ్బంది పట్టించుకునేవారు కాదన్న ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో సంస్థ సీఎండీ శేషగిరి బాబు ఐదు జిల్లాల్లో టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా సేవలను విస్తృతం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఎవరైన వినియోగదారుడు సమస్యను టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించిన వెంటనే విశాఖ కార్పొరేట్ కార్యాలయంలో దాని నిర్వహణ చూసే సిబ్బంది అధికారులకు సమాచారం అందజేస్తారన్నారు. వారు ఆ సమస్యను విద్యుత్ సేవల చట్టం ప్రకారం నిర్ణీత సమయంలోగా పరిష్కరిస్తారని లేని పక్షంలో వారిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటారన్నారు.
30 నుంచి ప్రతీ సోమవారం విద్యుత్ గ్రీవెన్స్‌సెల్..
విద్యుత్ వినియోగదారుల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ఈ నెల 30 నుంచి ప్రతీ సోమవారం విద్యుత్ గ్రీవెన్స్‌సెల్ నిర్వహించనున్నట్టు ఎస్‌ఈ శ్రీనివాసమూర్తి ప్రకటించారు. ప్రతీ సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే కార్యక్రమంలో నేరుగా తానే వినియోగదారుల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకుని సత్వర విద్యుత్‌సేవలు పొందాలన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు సర్కిల్ టెక్నికల్ డీఈటీ ఎల్.దైవప్రసాద్ పాల్గొన్నారు.