ప్రజాసమస్యలను రచ్చబండలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తెలియజేసేందుకు శాంతియుతంగా
జగ్గయ్యపేట/ పెనుగంచిప్రోలు/ వత్సవాయి, న్యూస్‌లైన్ : ప్రజాసమస్యలను రచ్చబండలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తెలియజేసేందుకు శాంతియుతంగా వస్తున్న తమను అరెస్టు చేయడం అన్యాయం, అక్రమమని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను మండిపడ్డారు.
శనివారం జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి వస్తున్న ముఖ్యమంత్రికి ప్రజా సమస్యలను విన్నవించేందుకు వస్తున్న ఉదయభానును పోలీసులు గ్రామ సమీపంలో బలవంతంగా అరెస్టు చేసి వత్సవాయి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
తమ నాయకుడిని బలవంతంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ చిల్లకల్లు వద్ద పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీసు జీపునకు అడ్డుపడి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి భానును వత్సవాయి స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. మార్గమధ్యంలో మక్కపేట వద్ద భానును తరలిస్తున్న వాహనాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకొని దాదాపు గంటపాటు జీపును కదలనీయకుండా నిర్బంధించారు. ఈ నేపథ్యంలో పోలీసులు, కార్యకర్తల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో భాను జోక్యం చేసుకని కార్యకర్తలను సముదాయించటంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
వైఎస్ ఫొటో లేకపోవడం దారుణం...
రచ్చబండ కార్యక్రమానికి రూపకల్పన చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో లేకుండా సభ నిర్వహించటం దారుణమని భాను విమర్శించారు. వైఎస్ ఆశయాలకు కిరణ్ సర్కారు తూట్లు పొడుస్తోందన్నారు. గత రచ్చబండలో చేసిన వాగ్దానాలు నెరవేర్చకుండా మరలా ప్రజలను మోసగించేందుకు రచ్చబండ నిర్వహిస్తున్నారని విమర్శించారు. ప్రజాకంటక ప్రభుత్వాన్ని త్వరలోనే ప్రజలు పారదోలుతారన్నారు. సమైక్యవాదం ముసుగులో కిరణ్ విభజన వాదాన్ని బలపరుస్తున్నాడని విమర్శించారు.
వత్సవాయి పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ఉదయభానును విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త పి.గౌతంరెడ్డి, పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా కన్వీనర్ కె.గురవయ్య, జిల్లా స్టీరింగ్ కమిటీసభ్యులు మండలి హనుమంతరావు, సూరపనేని రామారావు, మందా వెంకన్న, భూక్యా రాజానాయక్, చిరుమామిళ్ల ప్రభాకరరావు, మారెళ్ల పుల్లారెడ్డి బ్రదర్స్, దారకపల్లి వీరమ్మ, విజయవాడ నాయకులు లంకా రాము, ఎంఎస్ నారాయణ, జగ్గయ్యపేట మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ తుమ్మేపల్లి నరేంద్ర, పెనుగంచిప్రోలు మండల వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ కన్వీనర్ గుజ్జర్లపూడి వడ్డీకాసులు తదితరులు ఉన్నారు.