ఏం తమాషా చేస్తున్నావా?
విజయవాడ: బెజవాడ కనకదుర్గ దేవాలయం ఈవో నర్సింగరావుపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు నిప్పులు చెరిగారు. దాదాపు రూ. 25 లక్షల విలువైన బంగారు పాదుకలు కనకదుర్గ అమ్మవారికి సమర్పించేందుకు శ్రీ మిత్ర హౌసింగ్ చైర్మన్ ఎం వి చౌదరి ఆదివారం దుర్గమ్మ గుడికి విచ్చేశారు. ఆయనతోపాటు టాలీవుడ్ హీరో శ్రీకాంత్, ఊహ దంపతులు మంత్రి ప్రతిపాటి పుల్లారావు కూడా వచ్చారు. అయితే అదే సమయానికి ఈవో నర్సింగరావు ఆలయంలో అందుబాటులో లేరు.
దాంతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వీఐపీలు వస్తున్నారని సమాచారం అందించిన ఈవో ఎక్కడికెళ్లాడంటూ మంత్రి పుల్లారావు దేవాలయం సిబ్బందిపై మండిపడ్డారు. మంత్రి దేవాలయానికి వచ్చారన్న వార్త తెలుసుకున్న ఈవో వెంటనే దేవాలయానికి వచ్చారు. ఆయన్ని చూస్తూ పుల్లారావు ఆగ్రహంతో ఊగిపోయారు. వీఐపీలు వస్తున్నారని సమాచరం ఉండి కూడా నీవు బయటకు ఎలా వెళ్లావంటూ ప్రశ్నించారు. ఏం తమాషాలు చేస్తున్నావా అంటూ ఈవో నర్సింగరావుపై మండిపడ్డారు.