టెన్త్ ఫలితాలపై పడనున్న ప్రభావం
సర్కారుకు పట్టని బీసీ విద్యార్థుల వెతలు
రూ.32కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి
ఇబ్బందులు ఎదుర్కొంటున్న కళాశాల విద్యార్థులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : పదోతరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. విద్యార్థులంతా ఏకాగ్రతతో సమాయత్తమవుతున్నారు. వసతి గృహాల్లో మెరుగైన ఫలితాలకోసం అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ట్యూటర్ల చేత పిల్లలకు పదును పెట్టిస్తున్నారు. జిల్లాలోని 45వసతి గృహాల్లో 1151మంది విద్యార్థులకు 168మంది ట్యూటర్లు ప్రత్యేక క్లాసులు చెబుతున్నారు. కానీ వారికివ్వాలని గౌరవ వేతనాన్ని ఏడు నెలలుగా ప్రభుత్వం చెల్లించడం లేదు.
ఇప్పటివరకు రూ. 22.68లక్షల మేర గౌరవ వేతనం రావాల్సి ఉండగా ఇంతవరకు రూ. 3.38లక్షలే విడుదల చేసింది. ఇంకా రూ.19.35లక్షలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. దాదాపు ఏడు నెలల వేతనం ట్యూటర్లకు అందాల్సి ఉంది. అధికారులు ఇదిగో అదిగో అనడమే తప్ప వారికి న్యాయం చేయలేకపోతున్నారు. పరీక్షలు సమీపిస్తున్న సమయంలో కూడా వారికి న్యాయం జరిగేలా కన్పించడం లేదు. దీనివల్ల టూటర్లలో నిరాసక్తత నెలకొంది. బోధనలో వారు చాలావరకూ శ్రద్ధ చూపలేకపోతున్నారు. ఈ ప్రభావం రాబోయే ఫలితాలపై పడుతుందేమోనని అధికారులు కలవరపడుతున్నారు.
ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బకాయి రూ.32కోట్లు
కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ. 88కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇంతవరకు రూ. 56కోట్లు మాత్రమే విడుదల చేసింది. విద్యా సంవత్సరం ముగియవస్తున్నా మిగతా రూ. 32కోట్లు విడుదల కాలేదు. దీనిపై ఆధారపడిన 57,772మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు పూర్తి స్థాయిలో జమ కాకపోవడంతో కొన్ని కళాశాలల యాజమాన్యాలు హాల్ టిక్కెట్లు ఇచ్చేందుకు ఇబ్బంది పెడుతున్నాయి.
ఈబీసీ విద్యార్థులూ ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. రూ. 15.54కోట్లకు రూ. 9.13కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇంకా రూ. 6.41కోట్లు రావాల్సి ఉంది. 4,257మంది ఈబీసీ విద్యార్థులకు ఫీజు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లైతే మూడేళ్లుగా రావట్లేదు. రూ. 2.45కోట్లకు రూ. 32.44లక్షలే విడుదల చేసింది. అది ఎటూ చాలదన్న ఉద్దేశంతో విడుదలైన నిధులను కూడా చెల్లించలేదు. మరో రూ. 2.13కోట్లు విడుదలైతే తప్ప వీరి సమస్య పరిష్కారం కాదు.
అధైర్యపడొద్దు : బీసీ వేల్ఫేర్ ఇన్‌చార్జి ఆఫీసర్
వసతి గృహాల్లో పనిచేస్తున్న ట్యూటర్లకు గౌరవ వేతనాలు త్వరలోనే విడుదలవుతాయని, ఇటీవల కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు బీసీ వేల్ఫేర్ ఇన్‌చార్జి ఆఫీసర్ మనోరమ ‘సాక్షి’కి తెలిపారు. పరీక్షలు సమీపిస్తున్న వేళ ట్యూటర్లు అశ్రద్ధ వహించకూడదని కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ నిధులు కూడా విడుదలవుతాయని చెప్పారు.
ఏడు నెలలుగా ట్యూటర్లకు అందని వేతనాలు
Published Tue, Mar 1 2016 11:49 PM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM
Advertisement
Advertisement