విశాఖ కలెక్టరేట్ వద్ద ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని అడ్డుకుంటున్న ఏసీపీ రమణ
ప్రజా సమస్యలే ఎజెండాగా వైఎస్సార్‌సీపీ ధర్నాలు
♦ పోటెత్తిన ప్రజలు... సర్కారు తీరుపై మండిపాటు
♦ పాలకపక్షం కళ్లు తెరిపించేలా సాగిన ఆందోళనలు
♦ విజయనగరంలో జాతీయ రహదారి దిగ్బంధం
♦ విశాఖలో మహిళా ఎమ్మెల్యేపై ఏసీపీ దౌర్జన్యం
సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రజా సమస్యలను పట్టించుకోని పాలకపక్షం కళ్లు తెరిపించేలా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్నెర్రజేసింది.
రాష్ట్రంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజల సమస్యలపై పోరుబాట పట్టింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు రాష్ట్రంలో కలెక్టరేట్‌ల వద్ద గురువారం నిర్వహించిన ధర్నాలు జనఘోషతో దద్దరిల్లాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా టీడీపీ సర్కారు తమను మోసం చేసిందని ప్రజలు తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ జిలా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు. చంద్రబాబు ఏరుదాటి తెప్ప తగలేసినట్టుగా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబుపై కూడా ఏ1గా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఎడ్లబండ్ల ర్యాలీ చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ టీడీపీ నేతలు జగన్‌పై బురద జల్లితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తూర్పుగోదావరిజిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో భారీ ఎత్తున జనం హాజరయ్యారు.
శ్రీకాకుళంలో జరిగిన ధర్నాలో పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం ప్రసంగించారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన వైఎస్సార్‌సీపీ నేతలు జాతీయ రహదారిని దిగ్బంధనం చేశారు. విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయ పరిసరాలు ధర్నాతో హోరె త్తాయి. గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతపురంలో కడప కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ఆందోళనకు భారీగా ప్రజలు తరలివచ్చారు. కృష్ణా ట్రిబ్యునల్‌వద్ద తమ వాదన విన్పించడంలో విఫలమవ్వడంతో రాయలసీమ రైతులకు నష్టం వాటిల్లుతుందని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా జరిగింది.
ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై పోలీసు దౌర్జన్యం
విశాఖ కలెక్టరేట్ వద్ద వైఎస్సార్‌సీపీ ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలను ఏసీపీ ఆర్.రమణ అడ్డుకున్నారు. కలెక్టర్ లేకపోవడంతో వినతిపత్రాన్ని గోడకు అంటించే యత్నం చేసిన నేతలను గెంటివేశారు. ఈ సందర్భంగా జరిగిన వాగ్వాదంతో కొద్దిసేపు తోపులాట జరిగింది.
ఇంతలో అక్కడికి వచ్చిన డీఆర్వో కె.నాగేశ్వరరావు ముఖ్యనాయకులు తన గదిలోకి రావాలని కోరారు. అయినప్పటికీ ఏసీపీ వారిని డీఆర్వో దగ్గరకు పంపేందుకు నిరాకరించి అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి చేయిపట్టుకుని బయటకు నెట్టి వేశారు. మహిళా ఎమ్మెల్యేనైన తనకు జరిగిన అవమానంపై అసెంబ్లీలో ప్రివిలైజ్ మోషన్ రైజ్ చేస్తామని ఆమె చెప్పారు.