కదం కలిపి.. ఐక్యత చాటి | Promote the unity of the combined Kadam .. | Sakshi
Sakshi News home page

కదం కలిపి.. ఐక్యత చాటి

Published Sat, Nov 1 2014 1:41 AM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM

కదం కలిపి.. ఐక్యత చాటి

కదం కలిపి.. ఐక్యత చాటి

కర్నూలు(జిల్లా పరిషత్): దేశ తొలి కేంద్ర హోంమంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్‌పటేల్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నగరంలో నిర్వహించిన జాతీయ ఐక్యతా ర్యాలికి విశేష...

కర్నూలు(జిల్లా పరిషత్):
 దేశ తొలి కేంద్ర హోంమంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్‌పటేల్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నగరంలో నిర్వహించిన జాతీయ ఐక్యతా ర్యాలికి విశేష స్పందన లభించింది. కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ సిహెచ్ విజయమోహన్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్.. కర్నూలు, కోడుమూరు ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, జాయింట్ కలెక్టర్ కన్నబాబు తదితరులు ర్యాలీలో కలెక్టర్ వెంట నడిచారు.

మరోవైపు సి.క్యాంపు సెంటర్, సిల్వర్‌జూబ్లీ కళాశాల, బళ్లారి చౌరస్తా, కొండారెడ్డి బురుజు నుంచి విద్యార్థులు, యువతీ యువకులు.. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, విద్యాసంస్థల అధినేతలు, ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చారు. నలుదిశల నుంచి ర్యాలీగా రాజ్‌విహార్ సెంటర్ చేరుకుని ప్రతిజ్ఞలో పాల్గొన్నారు. వీరిచే జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదేనన్నారు.

ఒక్క పిలుపునకు ఇన్ని వేల మంది తక్కువ సమయంలో కలసి రావడం ప్రజల్లోని ఐక్యతకు నిదర్శనమన్నారు. ప్రపంచంలో ఏ దేశాన్నైనా తిప్పికొట్టగల సత్తా ఒక్క భారత్‌కే సొంతమన్నారు. ప్రతి ఒక్కరూ వైషమ్యాలు, ఈర్ష్యాద్వేషాలు వీడి దేశ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలన్నారు. సర్దార్ వల్లభాయ్‌పటేల్‌ను స్ఫూర్తిగా తీసుకుని దేశంలోని 120 కోట్ల మంది ఉక్కుమనుషులుగా మారాలని పిలుపునిచ్చారు.

కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ పి.వి.వి.ఎస్ మూర్తి మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్య్రోద్యమంలో రైతు ఉద్యమం నిర్వహించి మహాత్మాగాంధీని ఆకర్షించారన్నారు. స్వాతంత్య్రోద్యమంలో ఆయన పాత్ర ఎనలేనిదన్నారు.

 కార్యక్రమంలో అడిషనల్ జాయింట్ కలెక్టర్ అశోక్‌కుమార్, డీఈవో కె.నాగేశ్వరరావు, ఆర్‌ఐవో సుబ్రమ్మణ్యేశ్వరరావు, డీవీఈవో సాలాబాయి, డీఎంహెచ్‌వో డాక్టర్ వై.నరసింహులు, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.జనార్దన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు జి.పుల్లయ్య, కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, కోశాధికారి వాసుదేవయ్య, సభ్యులు నాగరాజు, ప్రశాంతరెడ్డి, కిష్టన్న, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement