రాష్ట్ర విభజన నిర్ణయంపై జిల్లాలో నిరసన సెగలు రగులుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరిలోనూ ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి.
సాక్షి, కడప : రాష్ట్ర విభజన నిర్ణయంపై జిల్లాలో నిరసన సెగలు రగులుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరిలోనూ ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. తెలుగు జాతిని ముక్కలు చేసి తీరుతామంటున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై జనాలు నిప్పులు కక్కుతూనే ఉన్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో అక్టోబరు 2వ తేదీ నుంచి నిరవధికంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలే దీక్షలు చేస్తూనే ఉన్నారు. వివిధ రూపాల్లో ఆందోళనలు చేపడుతున్నారు.
వైఎస్సార్ సీపీ దీక్షలు
జమ్మలడుగు నియోజకవర్గంలో గూడెం చెరువుకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు ఎంవీ రమణయ్య ఆధ్వర్యంలో పది మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త సూర్యనారాయణరెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యుడు హనుమంతరెడ్డిలు సంఘీభావం తెలిపారు.
పులివెందులలో వైఎస్సార్ సీపీ నాయకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో జీపులు, సుమోలతో ర్యాలీ నిర్వహించారు. చక్రాయపేటకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు 50 మంది బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
రైల్వేకోడూరులో రెడ్డివారిపల్లెకు చెందిన కొరముట్ల వెంకట రమణ, గొంటు సుబ్రమణ్యం ఆధ్వర్యంలో 12 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కొల్లం బ్రహ్మానందరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పంజం సుకుమార్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.
రాజంపేటలో నందలూరు మండలానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు దినేష్ ఆధ్వర్యంలో 40 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి సంఘీభావం తెలిపారు.
బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల పట్టణంలో కృష్ణశారద కళాశాలకు చెందిన 15 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
రాయచోటి నియోజకవర్గంలో రామాపురం మండలానికి చెందిన సుద్దమల కల్పనాయునిచెరువు, నీలకంఠరావుపేట గ్రామాలకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, మాజీ ఎంపీపీ గడికోట జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో 40 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ దేవనాథరెడ్డి సంఘీభావం తెలిపారు. కడపలో 47వ వార్డుకు చెందిన పవర్ అల్తాఫ్ ఆధ్వర్యంలో 35 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి నియోజకవర్గ సమన్వయకర్త అంజాద్‌బాష, మాసీమబాబు సంఘీభావం తెలిపారు.
కొనసాగుతున్న సమైక్య ఆందోళనలు
కడపలో న్యాయవాదులు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. నగరంలో ఉపాధ్యాయులు రక్తంతో సంతకాలు చేసి వాటిని జీఓఎంకు పంపేందుకు సిద్ధం చేస్తున్నారు. ప్రొద్దుటూరులో న్యాయవాదులు రిలే దీక్షలు చేపట్టారు. బద్వేలులో జేఏసీ, విద్యార్థుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు సాగుతున్నాయి. రాయచోటిలో న్యాయవాదులు సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగిస్తున్నారు. మైదుకూరులో ఉర్దూ పాఠశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.