సమైక్య ప్రతిజ్ఞ
సాక్షి నెట్‌వర్క్: రాష్ర్ట విభజన యత్నాలను నిరసిస్తూ, ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలని కాంక్షిస్తూ వరుసగా 102వ రోజూ శనివారం సీమాంధ్ర జిల్లాల్లో ఆందోళనలు, ప్రదర్శనలు కొనసాగాయి. పశ్చిమగోదావరి జిల్లా పొంగుటూరులో విద్యార్థులు సమైక్య వాగ్దానం చేశారు. ‘రాష్ట్ర విభజన ప్రక్రియను మొక్కవోని ధైర్యంతో ఎదిరిద్దాం. తెలుగు జాతి పౌరుషాన్ని నిలబెడదాం. అమరజీవి ఆశయాన్ని కాపాడుదాం’ అంటూ గేయరూపంలో ప్రతిజ్ఞ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జేఏసీ ఆధ్వర్యంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద పెట్టున యువతుల సమైక్యాంధ్ర నినాదాలతో పట్టణం మార్మోగింది. రాజమండ్రిలో ఏపీఎన్జీఓలు, కాకినాడలో కలెక్టరేట్ ఎదుట జేఏసీ నేతలు మానవహారాలుగా నిలబడ్డారు.
ముమ్మిడివరంలోని 216 జాతీయ రహదారిపై సమైక్యవాదులు రాస్తారోకో చేపట్టారు. విశాఖ జిల్లా పాత గాజువాక సెంటర్‌లో వర్తక సంఘం మానవహారంగా ఏర్పడి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సద్భావన సర్కిల్‌లో ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. కళ్యాణదుర్గంలో విద్యార్థులు సేవ్ ఆంధ్రప్రదేశ్ ఆకారంలో కూర్చొని నినాదాలు చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో భారీ చేపట్టారు. తిరుపతిలో తెలుగుతల్లి విగ్రహం వద్ద ఎన్జీవోలు సమైక్య సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
వైఎస్సార్ సీపీ శ్రేణుల ఉద్యమ పథం
సాక్షి నెట్‌వర్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు సమైక్యాంధ్ర పరిరక్షణకు నిర్విరామ పోరు సాగిస్తున్న పార్టీ శ్రేణులు శనివారం నాడూ విభిన్నరూపాల్లో ఆందోళనలు చేపట్టాయి. తూ.గో. జిల్లా కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలో పార్టీ కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో కార్యకర్తలు రాస్తారోకో చేసి టీ నోట్ అని రాసిన ప్లకార్డులను చించివేశారు. కృష్ణాజిల్లా కైకలూరులో కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వదిష్టిబొమ్మను దహనం చేశారు.