సాక్షి నెట్‌వర్క్: రాష్ట్ర సమైక్య సాధన కోసం వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆదివారం నాడూ అవిశ్రాంత పోరాటం సాగించాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు నేతలు, కార్యకర్తలు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో పార్టీ సమన్వయకర్త షమీమ్ అస్లాం నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. తిరుపతిలో కార్యకర్తల రిలే నిరాహారదీక్షను ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రారంభించారు. శ్రీకాళహస్తిలో కృష్ణారెడ్డి, పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి దీక్షలో పాల్గొన్నారు. కృష్ణాజిల్లా కురుమద్దాలి శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నేత ఉప్పులేటి కల్పన ప్రత్యేక పూజలు చేశారు. తిరువూరులో శీలం నాగనర్సిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు రిలేదీక్ష చేపట్టారు.
ప్రకాశం జిల్లా చీరాలలో 530 మంది ఆర్టీసీ కార్మికులకు పార్టీ నేత చినరోశయ్య, ఎన్‌ఆర్‌ఐ విభాగం నాయకుడు బాలాజీలు బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా మాచర్లలోని రిలే దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి, కావలిలో, అనంతపురం జిల్లా ధర్మవరంలో పార్టీ కార్యకర్తలు రిలేదీక్షలు చేపట్టారు.