పీఆర్సీ ఫలాలేవీ? | PRP Phalalevi? | Sakshi
Sakshi News home page

పీఆర్సీ ఫలాలేవీ?

Published Mon, Mar 23 2015 2:46 AM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM

పీఆర్సీ ఫలాలేవీ? - Sakshi

పీఆర్సీ ఫలాలేవీ?

  • జీవోల కోసం ఉద్యోగుల ఎదురుతెన్నులు
  • వేతనాల పెంపును ఇంతవరకు ఆమోదించని మంత్రివర్గం
  • సాక్షి, హైదరాబాద్: మరో వారంలో మార్చి నెల ముగిసిపోతోంది. ఉద్యోగుల వేతనాల పెరుగుదలకు సంబంధించి ఈ నెలాఖరులోగా ప్రభుత్వం జీవో జారీ చేస్తేనే ఏప్రిల్ నెల జీతంలో పెంపు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పదో వేతన సవరణ సంఘం సిఫారసులను అమలు చేస్తూ ప్రభుత్వం ఇవ్వాల్సిన జీవోల కోసం ఉద్యోగులు ఆదుర్దాగా నిరీక్షిస్తున్నారు.
     
    స్థిరీకరణ చేస్తేనే మే 1న కొత్త జీతాలు

    ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్(మూల వేతనంలో పెంపు) చెల్లించేందుకు అంగీకరిస్తూ సీఎం చంద్రబాబు ఫిబ్రవరి 9వతేదీన ప్రకటన చేయటం తెలిసిందే. వేతనాల పెంపు 2014 జూన్ నుంచి వర్తిస్తుందని సీఎం పేర్కొన్నారు. అప్పటి నుంచి 2015 మార్చి వరకు అంటే 10 నెలల బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది. ఉద్యోగులకు కొత్త వేతనాల నగదు ప్రయోజనం ఏప్రిల్ నుంచి అందుతుంది. జీతాల్లో పెరుగుదల మే 1వతేదీన అందుకునే జీతంలో కనిపించనుంది. ఏప్రిల్ నెల జీతాల కోసం బిల్లులను 20 తేదీన ట్రెజరీలకు సమర్పించాలి. వేతనాల స్థిరీకరణ కసరత్తు పూర్తి చేయడానికి కనీసం 20 రోజుల సమయం పడుతుందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ నెలాఖరులోగా పీఆర్సీ అమలు జీవోలు వస్తేనే ఏప్రిల్ 20కి వేతనాల స్థిరీకరణ పూర్తై మే 1న అందుకునే జీతంలో పెంపుదల ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
     
    మంత్రివర్గం ఆమోదం ఏదీ..?

    ఉద్యోగులు వేతనాలకు సంబంధించి ప్రభుత్వం ఫిట్‌మెంట్ ప్రకటించి ఇప్పటికే దాదాపు నెలన్నర దాటినా ఇప్పటికీ మంత్రివర్గం ఆమోదముద్ర పడలేదు. శాసనమండలి ఎన్నికల సందర్భంగా కోడ్ కూడా ముగిసిన ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి పీఆర్సీ అమలు జీవోలు జారీ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా జీవోలు వెలువడకపోతే ఏప్రిల్ నెలలో కొత్త వేతనాలు అందుకోలేమనే ఆందోళన వారిలో నెలకొంది. 10 నెలల పీఆర్సీ బకాయిలను కూడా జీపీఎఫ్ ఖాతాకు జమ చేయాలని కోరుతున్నారు. బాండ్లు, తదితరాలు వద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
     
    15 రోజుల బకాయిలు విరాళమా?

    10 నెలల వేతన బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా.. అందులో 15 రోజుల బకాయిలను రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇవ్వాలని ఉద్యోగ సంఘాల జేఏసీ తీర్మానం చేయడం పట్ల ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సీఎం ప్రకటన కేవలం ఫిట్‌మెంట్, ఆర్థిక లబ్ధి అమలు తేదీ ప్రకటనకే పరిమితమైందని ఉద్యోగులంటున్నారు. ఈ రెండు అంశాలే కాకుండా మిగతా డిమాండ్లపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వెంటనే జీవోలు జారీ చేయాలని కోరుతున్నారు.
     
    ఉద్యోగుల మిగతా డిమాండ్లు ఇవీ
    మహిళా ఉద్యోగులకు పిల్లల సంరక్షణ కోసం రెండేళ్ల పాటు సెలవు ఇవ్వాలని పీఆర్సీ సిఫార్సును అమలు చేయాలి.
     
    కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిని 8 కిలోమీటర్లుగా పీఆర్సీ పేర్కొంది. పట్టణీకరణ పెరగడం వల్ల నగరాలు, పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నాయి. అందువల్ల ఈ పరిధిని 15 కిలోమీటర్లుగా నిర్ణయించాలి.
     
    ఇంక్రిమెంట్ రేట్ 2.33 శాతం ఇవ్వాలని పీఆర్సీ సిఫార్సు చేసింది. దాన్ని కనీసం 2.832 శాతానికి పెంచాలి. కేంద్ర ప్రభుత్వం 3 శాతం ఇస్తోంది.
     
    గ్రాట్యుటీని రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంచాలి.
     
    అన్ని జిల్లా కేంద్రాల్లో ఇంటి అద్దె భత్యాన్ని 20 శాతం ఇవ్వాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం 2 లక్షల కంటే తక్కువ జనాభా ఉంటే 14.5 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఫలితంగా మచిలీపట్నం, శ్రీకాకుళం, చిత్తూరు పట్టణాల్లో ఇంటి అద్దె భత్యం 14.5 శాతమే ఉంటుంది. దీన్ని 20 శాతానికి పెంచాలి.
     
    ఉద్యోగుల పిల్లల ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ను కేంద్రప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెంచాలి.
     
    సచివాలయంలో పనిచేస్తున్న ఏఎస్‌వో, ఎస్‌వోలకు గతంలో స్పెషల్ పే ఉంది. ఇప్పుడు వాటిని కొనసాగించకుండా పదో పీఆర్సీలో తగ్గించారు. వారికి స్పెషల్ పే కొనసాగించాలి. ఏఎస్‌వోకు సూపరింటెండెంట్ స్కేల్ ఇవ్వాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement