సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల వివరాలూ సేకరించడానికి రంగం సిద్ధమైంది. హెల్త్‌కార్డుల కోసమంటూ ట్రెజరీల ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల డేటా సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగుల స్థానికత, ఇతర వివరాలతో కూడిన డేటా ఇవ్వాలని ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు లేఖలు రాసింది. ఏ ప్రాంతానికి చెందినవారు? సర్వీసు ఎంత? ఏ రాష్ట్రంలో కొనసాగించాలని భావిస్తున్నారు? తదితర ప్రశ్నలతో కూడిన ప్రొఫార్మాను లేఖతో పాటు జత చేసింది. ఏపీఐఐసీ, మార్క్‌ఫెడ్ తదితర సంస్థల్లో ఉద్యోగుల డేటా సేకరించడం ప్రారంభమైంది. పీఎస్‌యూలకు ఆరు సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేయని విషయం తెలిసిందే. చాలా సంస్థల్లో రాష్ట్రస్థాయిలోనే నియామకాలు జరిగాయి.
ఆయా సంస్థల సర్వీసు నిబంధనల్లో కూడా జోనల్ వ్యవస్థ ప్రస్తావన లేదు. ఈ నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన లేదా ఇరు ప్రాంతాల్లోని టర్నోవర్ ఆధారంగా స్టాఫ్ ప్యాట్రన్ నిర్ణయించి, ఉద్యోగుల స్థానికత, ఆప్షన్ ఆధారంగా విభజించే అవకాశం ఉంది.