బతుకు... బతికించు
నాన్నకు కాసింత జ్వరం వస్తే ఆ కన్న కూతురు తట్టుకోలేదు. దగ్గరుండి మాత్రలు వేసి, తల్లిలా గోరుముద్దలు తినిపిస్తేనే గానీ ఆమెకు శాంతి లభించదు. అదే కూతురు ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకుంటే ఆ తండ్రి ఎంత క్షోభ అనుభవిస్తాడు? ‘అమ్మా... నాకు ఉద్యోగం వచ్చేసిందిగా... మరేం ఫర్వాలేదు. మన జీవితాలు మారిపోతాయి. నీకు ఏ లోటూ లేకుండా చూసుకుంటానమ్మా...’అని ప్రేమగా చేతిలో చేయి వేసి చెప్పిన కొడుకు ఒత్తిడి తట్టుకోలేక ప్రాణం తీసుకుంటే ఆ తల్లిపేగు ఎంతగా బాధపడుతుంది? ‘ఇంకొంచెం కష్టపడితే చాలురా... ఉద్యోగం వచ్చేస్తుంది. ఆ తర్వాత ఫ్యామిలీని బాగా చూసుకుంటా’ అని చెప్పిన మిత్రుడు తెల్లారితే ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపిస్తే స్నేహితులు ఎంత నరకం అనుభవిస్తారు? జీవితంలో అన్ని ప్రశ్నలకూ ఆత్మహత్యలో సమాధానం వెతుక్కునే వారు ఆఖరుకు తమ వారికి ఇలాంటి ప్రశ్నలనే మిగిల్చి వెళుతున్నారు. జిల్లాలోనూ ఆత్మహత్యల ఘటనలు ఎక్కువైపోతున్నాయి.
విజయనగరం క్రైం: కాలేజ్‌లో లెక్చరర్ తిట్టారని ఒక విద్యార్థిని, భర్త వేధింపులు తాళలేక మరో వి వాహిత, ఉద్యోగం రాలేదని ఓ యువకుడు... ఇలా కారణాలేవైనా నిండు ప్రాణా లు బలి తీసుకుంటున్నారు. సమస్యలతో పోరాడలేక జీవితాన్ని బల వంతంగా ముగించేస్తున్నారు. క్షణికావేశంలో కొం దరు తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అయినవారి గుండెల్లో ఆరని మంట రగులుస్తున్నాయి. తీరని వేదన మిగులుస్తున్నాయి. కష్టాలు ఎదురైతే ధైర్యంగా ఎదుర్కోవాలని, ఆత్మహత్య వల్ల సమస్యలు వస్తాయి గానీ సమసిపోవని నిపుణులు చెబుతున్నారు. ఇంకా...
ముందుగా తెలియజేస్తారు...
ఆత్మహత్యకు మొదటి కారణం ఒత్తిడి. తమకు ఆత్మహత్య ఆలోచన వస్తున్నప్పుడు ఆ ప్రయత్నాలను సీరియస్‌గా చేయాలకున్న వ్య క్తులు వివిధ రకాల సిగ్నల్స్‌తో తమ వారిని తెలియజేస్తారు. తమకు ఇష్టమైన వస్తువులను ఎవరికైనా బహుమతిగా ఇవ్వాలని చూడవచ్చు. ఉత్తరాలూ రాయవచ్చు. ఆత్మహత్య చేసుకుంటాడు అన్న అనుమానం ఉన్న వారిని ఒంటరిగా ఉండనీయకూడదు. తమ విలువ కుటుంబంలో ఎంత ఉందో తెలుసుకోవాలని కొందరు సరదాగా ఆత్మహత్య ప్రయత్నం చేస్తారు. కాని ఒక్కోసారి సీరియస్ అవ్వవచ్చు.
తరచూ ఆ మాటలు అనే వారిని వీలైనంత ఆదరణ, అత్మీయత, ప్రేమను కలుగుజేయాలి. కొందరు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ కావాలని తమ మాటల్లోనే నెగ్గాలని భావిస్తారు. వారిది హిస్టిరికల్ పర్సనాలిటీ. ఇలాంటి వారికి లొంగుతూ వెళ్తే వారు అలాగే కొనసాగుతారు. అసూయ, ఓర్వలేని తనం తన మాట నెగ్గకపోతే నానా హైరానా చేసే వారు అందరి దృష్టి తమవైపు తిప్పుకోవడం కోసం ఏ పనైనా చేస్తారు. తాము ఎవరిని ఆకర్షించాలని అనుకుంటున్నారో వారి సమక్షంలోనే చేయాలనుకుంటారు. డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకునే వారికి వీరు పూర్తి వ్యతిరేకం. ప్రస్తుతం దేశంలో ప్రతి ఆరు నిమిషాలకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటే..?
మీకు తెలిసిన వారికి ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటే మొదట అత్మీయులకు బాధను చెప్పుకోవాలి.
అలా చెప్పుకోనేలా ఆత్మీయులు వారిని ప్రోత్సహించాలి. వీలైనంత వరకు ఒంటరిగా ఉండనీయరాదు. ఏ మాత్రం అనుమానం వచ్చిన సైకాలజిస్ట్‌ను కలవడం ఉత్తమం.
డిప్రెషన్‌లో ఉన్నప్పుడు...
ఆత్మహత్యలు ఒత్తిడిలో ఉన్నప్పుడు చేసుకుంటారు. అలాంటి వారిని ముందుగానే గుర్తించవచ్చు. ప్రత్యేక పరిస్థితులను బట్టి ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకున్న వారు ముందుగానే ఇండికేషన్ ఇస్తారు. అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రపంచంలో గుండె జబ్బు తర్వాత రెండో వ్యాధిగా మానసిక వ్యాధిని గుర్తించారు. ప్రతి ఆరు నిముషాలకు ఒక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకోకుండా డిప్రెషన్‌లో ఉన్నవారిని ప్రత్యేక కౌన్సెలింగ్ ద్వారా మార్చవచ్చును.
- డాక్టర్ ఎస్.వి.రమణ,
సైకాలజిస్ట్ ప్రశాంతి మానసిక వ్యాధుల కౌన్సిలింగ్ కేంద్రం