చర్చకొస్తాయా ! | public issues in vizianagaram district | Sakshi
Sakshi News home page

చర్చకొస్తాయా !

Published Fri, Jan 2 2015 3:17 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

public issues in vizianagaram district

సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలో అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి. మన ఎమ్మెల్యేల్లో కొందరు ఇటీవల అసెంబ్లీలో గళం విప్పారు. నియోజకవర్గ దీర్ఘకాలిక సమస్యలను ప్రస్తావించారు.  ఇప్పుడు జిల్లా  వంతు వచ్చింది. కీలకమైన జెడ్పీ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరగనుంది. ప్రజలెదుర్కొంటున్న సమస్యలు, కష్టాలపై  ఈ సమావేశాల్లో  చర్చించి, పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇక, ఎజెండాలో పేర్కొ న్న అంశాలన్నీ జెడ్పీ సమావేశంలో చర్చకు రావడం లేదు. ముఖ్యంగా చివరిలో ఉన్న అంశాల గల శాఖలపై కనీస చర్చ జరగ డం లేదు. నాలుగైదు అంశాలపై చర్చించి, సాగదీతతో మమ అన్పించే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సమావేశంలోనైనా గతంలో చర్చకు రాని అంశాలను ముందుకు తీసుకురావల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా విద్యాశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్, గిరిజన సంక్షేమ,ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ జరపాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటారేమో చూడాలి.
 
 జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నెలకున్న పరిస్థితులివి...
 తుపాను సాయంలో రాజకీయం
  హుద్‌హుద్ తుపాను వెలిశాక జిల్లాకొచ్చిన సీఎం   తొలిసారిగా భోగాపురం మండలం దిబ్బలపాలెంలో పర్యటించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటానని,  ఇళ్లు కోల్పోయిన వారందరికీ ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా అధునాతన ఇళ్లు నిర్మిస్తానని ప్రకటించారు. దీంతో గ్రామస్తులు సంతోషించారు. ముఖ్యమంత్రి ఆదుకుంటారని భావించారు. కానీ అవేవీ ఆచరణకు నోచుకోలేదు. కనీసం ప్రకటించిన పరిహారం కూడా అందరికీ అందలేదు.  టీడీపీ వాళ్లకే దాదాపు  సాయం అందించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామంలో సుమారు 80 ఇళ్లు దెబ్బతినగా కేవలం 20 ఇళ్లకు పరిహారం అందించారు. మిగతా వారిని గాలికొదిలేశారు.   నీలాపు బంగారమ్మ, నీలాపు రాములప్పయ్యమ్మ, బొట్టు సూరమ్మ, దల్లి కనకం, శీల ముత్యమ్మ, దల్లి సత్తెమ్మ, శీల సత్తెమ్మ,పిట్ట సూరమ్మ, పిట్ట కనకం, నీలాపు సూరప్పయ్యమ్మ, నీలాపు ఆదమ్మ...ఇలా 60 మంది వరకు ఇళ్లు కోల్పోయి పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు.
 
 
  గంట్యాడ మండలం మధుపాడ గ్రామానికి చెందిన ద్వారపురెడ్డి కృష్ణారావు తన మూడెకరాల పొలంలో అరటి సాగు చేయగా, హుద్‌హుద్ తుపానుకు ఆ తోట పూర్తిగా ధ్వంసమయింది. పంట నష్టం అంచనా వేయడానికి వచ్చిన అధికారులు సైతం ఫొటోలు తీసి నష్టాన్ని రికార్డు చేశారు. కానీ పరిహారం జాబితాలో ఆయన పేరు గల్లంతైంది. పరిహారం వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ రైతు ఇప్పుడు లబోదిబోమంటున్నాడు.   బలిజిపేట మండలం గౌరీపురం గ్రామంలో  తుపానుకు 300 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. ప్రభుత్వం ఆదుకుంటుందని  రైతులంతా ఆశలు పెట్టుకున్నారు. కానీ పరిహారం  23 ఎకరాలకే మంజూరయింది. దీంతో పాడైన  వరి పంటను తగలబెట్టి నిరసన తెలియజేశారు.
 
  గంట్యాడ మండలం మధుపాడలో అరటి పంటకు తీవ్ర నష్టం జరిగింది. కానీ సర్పంచ్ వర్గీయులకే పరిహారం మంజూరైంది. దీంతో మిగతా రైతులకు అనుమానం వచ్చింది. వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రాజకీయ కారణాలతో సర్పంచ్ బొడ్డకాయల శ్రీనివాసనాయుడు ఇంట్లో కూర్చుని   తెలుగుదేశం కార్యకర్తలకే పరిహారం అందేలా   జాబితాను  మార్చారని, అర్హులైన దాదాపు పది మంది పేర్లు గల్లంతయ్యాయని,  రెండు నుంచి మూడెకరాల్లో అరటి పంటను నష్టపోయిన వారి పేర్లను మార్చి,  పంటనష్టాల్లేని సర్పంచ్ బంధువులు, వర్గీయులకు మాత్రం పరిహారాన్ని మంజూరు చేశారని బాధితులు రోడ్డెక్కుతున్నారు. ఊర్లో లేని వారిపేరున, ప్రభుత్వ ఉద్యోగుల పేరున  కూడా పరిహారం తీసుకున్నారని  కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు.
 
 ఇలా జిల్లాలో ఎక్కడా చూసినా పరిహారం మంజూరు విషయంలో వివక్ష చూపారని స్పష్టమవుతోంది. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు, వారి అనుచరులకే పరిహారంలో పెద్ద పీట వేశారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే మత్స్యకారులకు, పశువులను కోల్పోయిన వారికీ ఇంతరకు  పరిహారమే మంజూరు కాలేదు.  హుద్‌హుద్ తుపాను వల్ల జిల్లాలో 1,552 మంది మత్స్యకారులు నష్టపోయారు. సుమారు రూ.కోటీ 55 లక్షల మేర నష్టం వాటిల్లింది. జిల్లాలో పెద్ద ఎత్తున పశువులు చనిపోయాయి. సుమారు 938 మంది బాధితులయ్యారు. రూ.4.31కోట్లు నష్టం జరిగినట్టు గుర్తించారు. ఇంతవరకు ఆ పరిహారం మంజూరు కాలేదు.    ఇక, వ్యవసాయ నష్టం అంచనా విషయానికి వస్తే 50 శాతం పైబడి నష్టం వాటిల్లిన వారినే గుర్తించారు. ఈ లెక్కన జిల్లాలో 19,689 మంది బాధితులకు రూ.6.83కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. దాంట్లో ఇంతవరకు 18,477మందికి రూ.6.17కోట్ల వరకు పంపిణీ చేశారు. మిగతా పరిహారాన్ని పంపిణీ చేసేందుకు మీనమీషాలు లెక్కిస్తున్నారు. ఉద్యానవన పంటల విషయానికొస్తే జిల్లాలో 31,431మంది రైతులను బాధితులుగా గుర్తించి రూ.31.19కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే, ఇంతవరకు 3,689మంది రైతులకు గాను రూ.23.54కోట్లు మాత్రమే పంపిణీ చేశారు.  
 
 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు
 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో అధికార పార్టీ నేతలు వేలు పెడుతున్నారు. మిల్లర్లు, వ్యాపారులు కుమ్మక్కై రైతుల వద్ద కొనుగోలు చేసి ఆ ధాన్యాన్నే కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. రైతు పేరుతో విక్రయిస్తున్నారు.   గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులను దోచేస్తున్నారు.   కేంద్రాలలో కొనుగోలు చేసిన ధాన్యం కూడా   అధికార పార్టీ నేతలకు చెందిన మిల్లర్లకే వెళ్తున్నట్టు ఆరోపణలొస్తున్నాయి.  ఇదంతా ఒక ఎత్తు అయితే కస్టమ్ మిల్లింగ్ కోసం  కేటాయిస్తున్న మిల్లుల్లో కూడా   అక్రమాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
 
  ఊగిసలాటలో  గిరిజన యూనివర్సిటీ
   గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు విశాఖ జిల్లా సబ్బవరంలో పెడతారని విశాఖ మంత్రులు చెబుతున్నారు. అదేమీ  కాదంటూ జిల్లా నేతలు కొత్త ప్రతిపాదనలు చేస్తున్నారు . నెల్లిమర్ల, బొండపల్లి, కొత్తవలసలలో ఏదొక చోట ఏర్పాటు చేస్తారని చెప్పుకొస్తున్నారు.  కానీ అధికారికంగా ఇంతవరకు స్పష్టత రాలేదు.  
 
 భారీ మంచినీటి పథకాల నిర్వహణకు టెండర్లు పిలవరా?
 జిల్లాలో రూ.10 లక్షలకు పైబడి నిర్వహణ వ్యయం ఉన్న భారీ మంచినీటి పథకాలకు టెండర్లు పిలిచి,కాంట్రాక్ట్  ఇవ్వాల్సి  ఉండగా ఒత్తిళ్లతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. దాదాపు 19 పథకాలు నామినేటేడ్‌గా నడిపించేసి కాలం గడిపేస్తున్నారు. వీటి ద్వారా అధికార పార్టీ అండ ఉన్న వారు రెండు చేతులా సంపాదించుకుంటున్నారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement