హామీ బూటకం మాఫీ నాటకం | Quackery is guaranteed to play waived | Sakshi
Sakshi News home page

హామీ బూటకం మాఫీ నాటకం

Published Fri, Dec 5 2014 3:30 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

హామీ బూటకం మాఫీ నాటకం - Sakshi

హామీ బూటకం మాఫీ నాటకం

అది పాతకడపలోని రాయలసీమ గ్రామీణ బ్యాంకు. అందులో 630 మంది రైతులు సుమారు రూ.2.88 కోట్లు పంట రుణాలుగా పొందారు.  చంద్రబాబు ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తుందని వారంతా ఆశించారు. ఆరు నెలల ఎదురుచూపు తర్వాత కేవలం 21 మంది రైతులే రుణమాఫీకి అర్హులంటూ ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. దీని ప్రకారం మాఫీ అయ్యేది రూ.5లక్షలే. మిగతా రూ.2.83 కోట్లు అనర్హులని తేల్చిన 609 మంది రైతులే చెల్లించాలట. తామేందుకు అనర్హులమో చెప్పాలని ఆ రైతులు పట్టుబడుతున్నారు.
 
  చింతకొమ్మదిన్నె రాయలసీమ గ్రామీణ బ్యాంకులో 1403 మంది రైతులు  రూ.5.86 కోట్లు రుణాలు పొందారు. చంద్రబాబు హామీని నమ్మి రెన్యువల్స్ చేసుకోలేదు. ఆమేరకు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏర్పడుతోన్న నష్ట నివారణ ఆస్కారం లేకుండా పోయింది. తాజాగా రుణమాఫీ జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. 728 మందినే అర్హులుగా తేల్చింది. తక్కిన వారికి రుణమాఫీ వర్తించదా?  నష్టపోతున్న పంటలకు నష్ట పరిహారం, అదనపు వడ్డీ భారం ఎవరు భరించాలి?అన్న రైతన్న ప్రశ్నలకు జవాబుల్లేవు.
 
 సాక్షి ప్రతినిధి, కడప: పై రెండు ఘటనలు ప్రభుత్వ రుణమాఫీలో వాస్తవాలకు మచ్చుతునకలు. జిల్లాలో లక్షలాది మంది రైతుల ఆశలు అడియాశలే అయ్యాయి. జిల్లాలో సుమారు 12లక్షల మంది రైతన్నలు రుణాలు మాఫీ అవుతాయని ఆశించారు. అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక, రుణాలు మాఫీకి విధివిధానాలంటూ కొత్తరాగం తీయడంతోనే రైతాంగం నిరాశ నిస్పృహలకు గురైంది. జిల్లాలో 2013-14 వరకూ 6,38,421మంది రైతులు రూ. 6063.19కోట్ల పంట రుణాలుగా వివిధ బ్యాంకుల్లో బకాయి ఉన్నారు.  మరో 5,59,493 మంది రైతులు రూ.2,124.43 కోట్లు బంగారు ఆభరణాలపై రుణాలు పొందారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాగ్ధానాలు మేరకు అవన్నీ రద్దు అవుతాయని రుణగ్రహితలు భావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సరికొత్త నిర్ణయంతో రైతన్నలు ఆశలు రోజురోజుకు నీరుగారిపోయాయి.
 
 ఆశలు ఆడియాశలుగా మారిన విధం...
 అధికారంలోకి రాగానే రైతులు,డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల హామీతో ప్రజానీకం ఆశగా ఎదురు చూసింది. జిల్లాలో సుమారు 12లక్షల మంది రైతన్నలు రుణాలు మాఫీ అవుతాయని ఆశించారు. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు విధివిధానాలంటూ కొత్తరాగం తీయడంతో రైతాంగం ఆశలు సన్నగిల్లాయి.  ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులకు ముడిపెట్టి 3,08,377 ఖాతాలున్న జాబితాలను బ్యాంకర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి. అయితే ప్రభుత్వం కేవలం 70,452  మందికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని బ్యాంకర్లకు జాబితా పంపారు.  
 ప్రభుత్వ తీరుతో అదనపు భారం....
 ‘మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు’ ఓవైపు రుణమాఫీ వర్తించకపోగా, మరో వైపు ఉన్న అప్పు సకాలంలో చెల్లించని కారణంగా రైతన్నలు అదనపు భారం భరించాల్సిన దుస్థితి నెలకొంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే అప్పులన్నీ మటుమాయం అవుతాయని భావించిన అన్నదాతలు మరోభారం భరించాల్సి వచ్చింది. ఆర్బీఐ నిబంధనలు ప్రకారం పంట రుణాలు పొందిన రైతులు ఏడాది లోపు రుణాలు చెల్లించకపోతే రూ.13.5 శాతం వడ్డీ భరించాల్సి ఉంది.
 
 దాంతో పాటు ఇన్‌స్ఫెక్షన్ ఛార్జీలు రూపేణ బ్యాంకు రుణం ఉన్న ప్రతిరైతు రూ.150 భరించాల్సి ఉంది. ఈ కారణంగా జిల్లాలోని రుణగ్రహితలైన రైతన్నలు రూ.725 కోట్లు అదనపు భారం భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆర్థికవేత్తలు వివరిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా లభ్యమైయ్యే క్రాప్ ఇన్సూరెన్సు కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వాన్ని నమ్మిమోసపోయిన రైతాంగం ఇన్సూరెన్సు అవకాశాన్ని చేజార్చుకుంది.
 
 నేడు కలెక్టరేట్ ఎదుట మహాధర్నా...
 రైతులు, మహిళలు రుణాలు మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రజల్ని పక్కాగా మోసగించారు. ప్రభుత్వ వైనం పట్ల ప్రజానీకం రగిలిపోతోంది. దగా పడ్డ ప్రజానీకానికి అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమరభేరి ప్రకటించింది. అందులో భాగంగా ఇదివరకే అన్నీ మండల కేంద్రాలల్లో ధర్నాలు చేసింది. జిల్లా కేంద్రాలల్లో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట శుక్రవారం మహాధర్నా నిర్వహించదలిచారు. పాలకుల మోసపూరిత వైఖరికి నిరశనగా చేస్తున్న పోరాటానికి ప్రజలు అండగా నిలవాలని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని ఆకాంక్షించారు.     
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement