
అర్హు లైన రైతులకు రుణమాఫీ
కాకినాడ సిటీ: అర్హులైన రైతులకు రూ.లక్షా 50 వేలు చొప్పున రుణమాఫీ వర్తింపచేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ అంశంపై బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 5న రుణమాఫీకి సంబంధించిన రైతుల బ్యాంక్ రుణాల వివరాలు సీడీ రూపంలో ఎన్‌ఐసీకి అందజేయాలని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. ఆ వివరాలు పరిశీలించి అర్హులైన రైతుల తుది జాబితాను ఈనెల 15వ తేదీలోగా తయారు చేయాల్సి ఉంటుందన్నారు. జాబితా రూపకల్పనలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
అనర్హులు జాబితాలోకి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం రేషన్‌కార్డు, ఆధార్ డేటాలను అనుసంధానం చేస్తూ జాబితాలు రూపొందించాలన్నారు. రైతు పేరు, సర్వే నంబర్, పట్టాదారు పాస్ పుస్తకం నంబర్, ఆధార్, రేషన్‌కార్డు నంబర్ వంటి వివరాలతో 27 కాలాల నమూనా పూర్తి వివరాలను 5వ తేదీలోపు ఎన్‌ఐసీకి అందించాలన్నారు. వీడియో కన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం బ్యాంక్ అధికారులతో కలెక్టర్ నీతూ ప్రసాద్ సమీక్ష జరిపారు. జిల్లాలోని రైతుల ఆధార్, రేషన్ కార్డు డేటాల అనుసంధానంతో రెవెన్యూ గ్రామాల వారీగా రుణమాఫీకి సంబంధించిన వివరాలను వెంటనే అందించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎస్.జగన్నాథస్వామి, వ్యవసాయ శాఖ జేడీ విజయ్‌కుమార్, డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌రాజు, వివిధ బ్యాంక్‌ల కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.