
చంద్రబాబువి మోసపూరిత సంతకాలు
హైదరాబాద్: టీడీపీలోకి చేరికలను ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విలువలు లేవని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి విమర్శించారు. చంద్రబాబుకు ఎందుకంత అభద్రతాభావమని ప్రశ్నించారు. టీడీపీలోకి చేరాలని భావిస్తున్న ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరుతున్నవారికి సిగ్గులేదని రఘువీరా ధ్వజమెత్తారు.
చంద్రబాబుతో పాటు టీడీపీలో ఇప్పుడున్నవారంతా నకిలీలేనని రఘువీరా రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా వందల హామీలిచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మోసపూరిత సంతకాలు చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్సీలు శనివారం సాయంత్రం టీడీపీలో చేరుతున్నారనే వార్తలు రావడంతో రఘువీరా పైవిధంగా స్పందించారు.