భళా రాజన్న క్యాంటీన్‌ | Rajanna Canteen Held Under YSRCP MLA Karumuri In Tanuku | Sakshi
Sakshi News home page

తణుకులో రాజన్నక్యాంటీన్‌

Published Tue, Sep 10 2019 9:13 AM | Last Updated on Tue, Sep 10 2019 9:13 AM

Rajanna Canteen Held Under YSRCP MLA Karumuri In Tanuku - Sakshi

తణుకులో రాజన్న క్యాంటీన్‌

సాక్షి, పశ్చిమగోదావరి(తణుకు) : తణుకులో రాజన్న క్యాంటీన్‌ నిర్వహణపై పేదల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు చొరవతో వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్‌ నిర్వహిస్తున్నారు. రూ.ఐదుకే పేదల కడుపు నింపుతున్నారు. నిత్యం 250 మందికి నాణ్యమైన భోజనం పెడుతున్నారు. తొలుత ఎమ్మెల్యే కారుమూరి తన సొంత నిధులతో క్యాంటీన్‌ నిర్వహించడానికి ముందుకు వచ్చారు.  అయితే ఆయనకు చేదోడువాదోడుగా నియోజకవర్గంలోని నాయకులు కూడా నిలిచారు. దీంతో రోజుకో దాత పేరుతో రాజన్న క్యాంటీన్‌ నిర్వహణ ప్రారంభించారు. రాబోయే రోజుల్లోనూ దీని నిర్వహణకు నిధులు సమకూరడంతో గతనెల 31 నుంచి ప్రారంభించిన క్యాంటీన్‌ విజయవంతంగా నడుస్తోంది. రాబోయే వంద రోజులకు సరిపడా నిధులను సమకూర్చిన వైఎస్సార్‌ సీపీ నాయకులు నిర్వహణ బాధ్యతలను భుజాలకు ఎత్తుకున్నారు.

18 మందితో కమిటీ
తణుకు పట్టణంలో రాజన్న క్యాంటీన్‌ నిర్వహణకు 18 మంది పార్టీ నాయకులతో కమిటీని ఏర్పాటు చేశారు. నిత్యం 250 మందికి భోజనం అందించడానికి వీలుగా ప్రణాళికసిద్ధం చేశారు. మొదటి రోజు భోజనానికి అయ్యే ఖర్చును ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు భరించడంతో నియోజకవర్గంలోని కొందరు నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, దాతలు ముందుకు వచ్చారు. దీంతో సుమారు 100 రోజులకు సరిపడా  నిధులు సమకూరాయి. ఇందుకు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను ప్రారంభించిన కమిటీకి గౌరవాధ్యక్షులుగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు, అధ్యక్షులుగా నార్గన సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా మారిశెట్టి శంకర్, కలిశెట్టి శ్రీనివాసు, చిక్కాల మోహన్‌ వ్యవహరిస్తున్నారు. తణుకు నియోజకవర్గంలో ఎవరైనా దాతలు లేదా పెళ్లిరోజు, పుట్టిన రోజు చేసుకునే వారు పేదలకు అన్నం పెట్టాలని భావిస్తే కమిటీని సంప్రదించాలని వారు కోరుతున్నారు. నాణ్యతతో కూడిన భోజనం అందించాలనే ఉద్దేశంతో పరిమితి లేకుండానే పేదలకు భోజనం వడ్డిస్తున్నారు.  ప్రస్తుతం ఒక స్వీటు, మూడు రకాల కూరలు, సాంబారు, పెరుగుతో పేదలకు భోజనం అందజేస్తున్నారు. మరోవైపు దాతల పేర్లు ఆరోజు క్యాంటీన్‌లో ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు.

దాతల సహకారం అభినందనీయం
పేదలకు అన్నం పెట్టేందుకు తణుకులో రాజన్న క్యాంటీన్‌ ప్రారంభించాం.  దాతల సహకారంతో దీనిని మొదలుపెట్టాం. రూ. 5కే భోజనం పెట్టేందుకు వైఎస్సార్‌ సీపీ నాయకులకు తోడు దాతలు ముందుకు రావడం అభినందనీయం. ప్రస్తుతం 250 మందికి భోజనం పెడుతున్నాం. రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను పెంచుతాం.
– కారుమూరి వెంకటనాగేశ్వరరావు, ఎమ్మెల్యే, తణుకు

సంతోషంగా ఉంది...
ఎలాంటి లాభాపేక్ష లేకుండా పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో ప్రారంభించిన రాజన్న క్యాంటీన్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే 100 రోజులకు సరిపడా నిధులు సమకూరాయి. దాతలు తమ పేరున భోజనం పెట్టడానికి ముందుకు వస్తున్నారు. నియోజకవర్గంలో ఎవరైనా పెళ్లిరోజు, పుట్టిన రోజు చేసుకుని పేదలకు అన్నం పెట్టాలని భావిస్తే రాజన్న క్యాంటీన్‌ ద్వారా అవకాశం కల్పిస్తున్నాం.  
– మారిశెట్టి శివశంకర్, కమిటీ ఉపాధ్యక్షులు, తణుకు

నాణ్యతలో రాజీపడం...
పేదలకు అన్నం పెట్టే క్రమంలో నాణ్యతలో ఎలాంటి రాజీ పడబోం. పేదలకు ఉచితంగానే భోజనం అందించాలని భావిస్తున్నప్పటికీ నామమాత్రంగానే రూ.5 వసూలు చేస్తున్నాం. పరిమితి లేకుండా ఎంత భోజనం వడ్డించడానికి అయినా వెనుకాడటంలేదు. ఇలాంటి మంచి కార్యక్రమానికి మనసున్న దాతలు మరింత మంది ముందుకు రావాలి.
– చిక్కాల మోహన్, కమిటీ సభ్యులు, తణుకు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement