పత్తికొండ/పత్తికొండ అర్బన్, న్యూస్‌లైన్: జిల్లా నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర మంత్రిగా పని చేస్తున్న టీజీ వెంకటేష్‌లు శనిగ్రహాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అదనపు పరిశీలకులు, కడప మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరాహార దీక్షకు మద్దతుగా పార్టీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణిరెడ్డి చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష గురువారం ముగిసింది.
ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి ఆయనకు టెంకాయ నీళ్లు ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం మాట్లాడుతూ కోట్ల, టీజీలు రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. తన భర్త కోట్లతో రాజీనామా చేయిస్తానని డోన్‌లో శపథం చేసిన సుజాతమ్మ ఇంతవరకు ఆ పని చేయించలేకపోయారన్నారు. ఈ విషయంలో సమైక్య ఉద్యమకారులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇక కర్నూలులో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా టీజీ వెంకటేష్ ముఖం చాటేయడంలో అర్థం లేదన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే.. కీలకమైన సమయంలో ఆయన వారికి అండగా నిలవకపోవడం సమంజసం కాదన్నారు. తెలంగాణను విడదీసి టీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకుంటే పది సీట్లయినా వస్తాయనే కాంగ్రెస్ అధిష్టానం విభజనకు తెరలేపిందన్నారు. కుమారుడు రాహుల్‌ను ప్రధానిని చేయాలనే స్వార్థంతోనే సీమాంధ్ర ప్రజల మనోభావాలను లెక్క చేయక సోనియా గాంధీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారన్నారు. తమ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్, టీడీపీలు రోజుకో కుట్ర పన్నుతున్నాయన్నారు. కాంగ్రెస్ నాయకులకు కల్లబొల్లి మాటలతో కాలయాపన చేయడం అలవాటైపోయిందన్నారు.
ప్రజల్లో ఆదరణ కోల్పోయిన చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర పేరిట కొత్త డ్రామా మొదలు పెట్టారని.. యాత్ర ప్రారంభమైతే ప్రజలే ఆయనకు తగిన బుద్ధి చెబుతారన్నారు. నాయకులు ఎలా ఉండాలో జగన్‌ను చూసి నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. కోట్ల హరిచక్రపాణిరెడ్డి మాట్లాడుతూ పదవుల కోసం పాకులాడే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కుటుంబంలో పుట్టినందుకు తాను సిగ్గుపడుతున్నానన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించని ఆయన చరిత్రహీనుడుగా మిగిలిపోతాడన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ గడిచిన నాలుగేళ్లలో ఎన్నిసార్లు పత్తికొండకు వచ్చారో లెక్కేసుకుంటే ప్రజల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుందన్నారు. ఎప్పుడూ లేనిది ఇప్పుడు తగుదునమ్మా అని వచ్చి సమైక్యాంద్ర ఉద్యమ కారులను హిజ్రాలతో పోల్చడంపై ఆయన నిప్పులు చెరిగారు. సంస్కారం మరచి మాట్లాడితే ప్రజలు హర్షించరన్నారు.
రాష్ట్రం ముక్కలైతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో కనీస జ్ఞానం లేని నాయకులు ప్రజాప్రతినిధులుగా చెలామణి అవుతున్నారని ఘాటుగా విమర్శించారు. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు ప్రతి ఇంటి నుంచి ఒకరు కొదమసింహాలై కదలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, మంత్రాలయం, ఆదోని, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్తలు బాల నాగిరెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, మంత్రాలయం మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మణిగాంధీ, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, నాయకులు ఎస్.రామచంద్రారెడ్డి, పోచిమిరెడ్డి మురళీధర్‌రెడ్డి, డాక్టర్ గిడ్డయ్య, పల్లె ప్రతాప్‌రెడ్డి, ప్రహ్లాదరెడ్డి, శ్రీరంగడు, దామోదర్‌ఆచారి, పత్తికొండ సర్పంచ్ బనావత్ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.
కోట్ల సూర్య, టీజీలు శనిగ్రహాలు
Published Fri, Aug 30 2013 3:21 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement