సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ర్టంలో నెలకొన్న పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకోవాలని కర్ణాటక భావిస్తోంది. రాష్ట్ర విభజన నిర్ణయానంతర పరిస్థితుల్లో తాము చేసే వాదనను ఇతర ప్రాంతాలవారు పట్టించుకోరనేది ఆ రాష్ట్ర ఎత్తుగడ. అందులో భాగంగా రాయలసీమ కృష్ణా బేసిన్ పరిధిలోకి రాదంటూ ట్రిబ్యునల్ ముందు కొత్త వాదన విన్పిస్తోంది. రాష్ట్రానికి నీటి కోటాను తగ్గించేలా చేసి తాను అదనపు నీటిని పొందాలనే ప్రయత్నాలు మొదలు పెట్టింది. కృష్ణానది నీటిపై ఆధారపడిన మన రాష్ట్రంలోని తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపుల్ని చేసింది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలతో పాటు మిగులు జలాల నుంచి మరో 190 టీఎంసీలు కేటాయించింది.
మొత్తం 448 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్టు గుర్తించిన ట్రిబ్యునల్ కర్ణాటకకు 177, మహారాష్ట్రకు 81 టీఎంసీల చొప్పున కేటాయించింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో కృష్ణాబేసిన్‌లో తుంగభద్ర, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులే ఉన్నాయని, వీటికి పాత కేటాయింపులైన 811 టీఎంసీలే ఎక్కువని ఇంతవరకు కర్ణాటక వాదిస్తోంది. తెలుగుగంగకు నీటి కేటాయింపులు చేయడం కృష్ణా బేసిన్‌లోని ప్రజలకు అన్యాయం చేయడమేనని అంటోంది. ఇదే క్రమంలో కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. మహారాష్ర్ట, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో కరువు పీడిత ప్రాంతం ఎక్కువ అని, అందుకోసం ఎక్కువ నీటిని కేటాయించాలని కోరుతూ మన రాష్ర్టం గతంలో ట్రిబ్యునల్‌కు ఒక నివేదికను సమర్పించింది. రాష్ర్టంలోని కృష్ణాబేసిన్‌లో సుమారు 89 వేల చదరపు కిలోమీటర్ల మేర కరువు పీడిత ప్రాంతం ఉందని ఆ మేరకు నీటి కేటాంపులు కావాలని కోరింది. కర్ణాటకలో 52 వేల చదరపు కిలో మీటర్ల మేరకే కరువు పరిస్థితులున్నాయని తెలిపింది. కానీ కర్ణాటక.. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను అదనుగా భావించి రాయలసీమ ప్రాంతం కృష్ణాబేసిన్ పరిధిలోకి రాదంటూ అడ్డగోలుగా వాదిస్తోంది. రాయలసీమను లక్ష్యంగా చేసుకున్నా మిగతా ప్రాంతాలవారు మాట్లాడే పరిస్థితి లేదని కర్ణాటక భావిస్తోంది. రాయలసీమ కృష్ణా బేసిన్ పరిధిలోకి రానందున ఆంధ్రప్రదేశ్‌లో కరువు పీడిత ప్రాంతం తమ రాష్ట్రంలో కంటే తక్కువే ఉందని వాదిస్తోంది. ఆ మేరకు మన రాష్ట్రానికి నీటి కేటాయింపులను కుదించాలని కోరుతోంది. ఈ దృష్ట్యా దిగువకు మిగులు జలాలను విడుదల చేయాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నది. ఏపీలోని తుంగభద్ర, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు అవసరాలకు 811 టీఎంసీల నీరు సరిపోతుంద ంటూ మిగులు జలాలపై మనకు హక్కు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
మిగులు జలాల్లో 203 టీఎంసీలు తమకు కేటాయించాలని ఆ రాష్ర్టం డిమాండ్ చేస్తోంది. ఈ వాదనను ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకుంటే...కృష్ణా జలాలపై ఆధారపడ్డ హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ, వెలిగొండ వంటి ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. వాస్తవానికి కర్నూలు-కడప (కెసి) కెనాల్ ద్వారా రాయలసీమ ప్రాంతానికి నీటి సరఫరా ఒప్పందం సుమారు 150 సంవత్సరాల క్రితమే ఉంది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసి నీటి కేటాయింపుల్ని చేశారు. అయితే ప్రస్తుతం కర్ణాటక వాదనలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ అంశంపై రాష్ర్ట ప్రభుత్వం తన వాదన లను గురువారం వినిపించనుంది.