సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాపై జలఖడ్గం విరుచుకుపడింది. భారీ వర్ష బీభత్సంతో జిల్లా తల్లడిల్లిపోయింది. రికార్డు స్థాయి వర్షపాతంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. గిద్దలూరులో ఓ విద్యార్థిని వాగులో కొట్టుకుపోయి దుర్మరణం పాలైంది. కొమరోలులో వాగులో పడి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. వేలాది ఎకరాల పంటపొలాలు నీటమునిగాయి. రోడ్లను ముంచెత్తిన వాగులతో రాకపోకలు స్తంభించిపోయాయి. గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. కాలనీలు జలమయమయ్యాయి. జిల్లాలో జన జీవనం అస్తవ్యస్థమైంది. బాధితులను ఆదుకోవాల్సిన అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో విఫలమైంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి కనీస స్పందన లేకుండాపోయింది. దాంతో ఆగ్రహించిన ప్రజలు రోడ్లపైకి వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ వర్ష బాధితులకు ఆపన్నహస్తం అందించింది.
గుండ్లకమ్మకు భారీ వరద
కనీవినీ ఎరుగని రీతిలో జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తునే ఉంది. ఉరుములు... మెరుపులు... పిడుగులతో ప్రజల గుండెలు దద్దరిల్లాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఒంగోలులోనే గరిష్టస్థాయిలో 34సెం.మీ వర్షపాతం నమోదు కావడం గమనార్హం. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు రికార్డుస్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. చిలకలేరు, కొంకివాగు, నల్లవాగు, భవనాశి చెరువు అలుగు పొంగిపొర్లడంతో గుండ్లకమ్మకు వరదనీరు ముంచెత్తింది. సంతనూతలపాడులో చిన్న కాల్వ, పెద్దకాల్వ పొంగిపొర్లుతున్నాయి. చీమకుర్తిలో ముదిగొండవాగుకు వరద ముంచెత్తింది. గిద్దలూరు నియోజకవర్గంలో పరిస్థితి ఇంతకంటే భీతావాహంగా మారింది. పైలేరు, సర్వేరెడ్డిపల్లెవాగు, పగిలేరు వరద నీటితో పొంగిపొర్లుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
పాణం తీసిన వ రద
పోటెత్తిన వాగులు, వంకలు ఒకర్ని బలితీసుకున్నాయి. మరో ముగ్గురు గల్లంతయ్యారు. గిద్దలూరులో పైలేరులో విజయలక్ష్మి అనే 8వ తరగతి విద్యార్థిని కొట్టుకుపోయింది. ఆమెను రక్షించేందుకు స్థానికులు, అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విజయలక్ష్మి మృతదేహాన్ని పోతవరం వద్ద గుర్తించారు. కొమరోలులో పొంగిపొర్లుతున్న సర్వేరెడ్డిపల్లెవాగు బీభత్సమే సృష్టించింది. రోడ్లుపై నుంచి ప్రవహిస్తున్న వాగును దాటబోయి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. 16 మంది విద్యార్థులు ఒకరి చేతలు ఒకరు పట్టుకుని రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న వాగులోకి నడుచుకుంటూ వస్తున్నారు. కాగా వరద ఉధృతికి మొదట నడుస్తున్న బత్తుల శ్రీను అనే డిగ్రీ విద్యార్థి కొట్టుకుపోయాడు. ఆ వెంటనే మిగిలిన 15 మంది కూడా వాగులో పడిపోయారు. అప్రమత్తమైన స్థానికులు వాగులోకి దూకి గాలింపు చర్యలు చేపట్టారు. వాగులో కొట్టుకుపోతూ ఓ చెట్టును పట్టుకుని ఉన్న 9 మందిని స్థానికులు గుర్తించి రక్షించారు. మొదట కొట్టుకుపోయిన ముగ్గురి ఆచూకీ బుధవారం రాత్రి వరకు లభించలేదు.
తీవ్రంగా నష్టపోయిన రైతులు
ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాలు అన్నదాత ఆశలను తుడిచిపెట్టేశాయి. భారీ వర్షాలకు జిల్లాలో పంటలు తీవ్రంగా నష్టపోయాయి. పత్తిపంట దాదాపుగా తుడిచి పెట్టుకుపోయింది. వరి, రాగి, మొక్కజొన్న పంటలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. వాటితో పోల్చుకుంటే పొగనారుమళ్ల నష్టం తక్కువుగానే ఉంటుందని భావిస్తున్నారు. పంటల నష్టాన్ని అప్పుడే చెప్పలేమని అధికారులంటున్నా నష్టం మాత్రం అనూహ్యంగా ఉండనుందని స్పష్టమవుతోంది.
అధికారిక లెక్కల ప్రకారం 16వేల హెక్టార్ల పత్తిపంట, 600 హెక్టార్ల రాగిపంట, 10 వేల హెక్టార్ల మిర్చిపంట, 8 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 5 వేల ఎకరాల్లో వరి పంట, 500 హెక్టార్ల పొగాకు నారుమళ్లు దెబ్బతిన్నాయి. కాగా అనధికారిక లెక్కల ప్రకారం పంటల నష్టం అంతకు రెట్టింపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒక్క పత్తిపంటే దాదాపు 30 వేల హెక్టార్లలో పత్తిపంట నష్టపోయినట్టు తెలుస్తోంది. పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో పత్తిపంట పూర్తిగా నాశనమైపోయింది. సంతనూతలపాడు, ఒంగోలు, కొండపి, కందుకూరు నియోజకవర్గాల్లో కూడా పత్తిపంట బాగా దెబ్బతింది. చీరాల నియోజకవర్గంలో 2వేల ఎకరాల వరి పంట నీటమునిగింది.
జల దిగ్బంధంలో గ్రామాలు
జిల్లాలో గ్రామాలకు గ్రామాలు నీటమునిగాయి. రాకపోకలు స్తంభించిపోయాయి. ఎన్.జి.పాడు మండలంలో గుండ్లకమ్మ చాప్టా మీదుగా నీరు ప్రవహిస్తుడటంతో రాకపోకలకు విఘాతం కలిగింది. ఒంగోలుతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్.ఎన్.పాడు మండలంలో ముంగమూరు, మద్దులూరు, ఎం.వేములపాడు, కొమ్మపల్లివారిపాలెం గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. చీరాలలో మూడు చేనేత కార్మికుల కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. చేనేత మగ్గాలు నీటమునిగాయి. ఒంగోలు నగరంలో 50 కాలనీలు జలమయమవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. నగరంలోని ప్రధాన రహదారులపైన 4అడుగుల ఎత్తున నీరు ప్రవహించడం గమనార్హం. ఒంగోలులోని 220 కేవీ విద్యుత్‌సబ్ స్టేషన్లలోకి భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. దాంతో ఒంగోలు నగరంలో విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. భారీ వర్షాలు ఆర్టీసీపైనా ప్రభావం చూపించాయి. జిల్లాలో 28 రూట్లలో 113 బస్సు సర్వీసులను ఆర్టీసీ రద్దు చేసింది. దాంతో ఆర్టీసీకి * 10లక్షలు నష్టం వాటిల్లింది.
మంత్రిగారి ఇంట పెళ్లంట!
భారీ వర్షాలైతే మాకేంటంట!!
ఇదీ అధికార యంత్రాంగం తీరు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల జిల్లాలో బుధవారం భారీ వర్షాలు పడతాయని వాతవరణ శాఖ మంగళవారమే హెచ్చరించింది. అయితే మాకేంటీ అన్నట్టుగా ఉంది జిల్లాలో ఎక్కువమంది అధికారుల తీరు. హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన మంత్రి మహిధర్‌రెడ్డి కుమార్తె వివాహానికే వారు మొగ్గుచూపారు. పొలో మంటూ హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. జిల్లాలో సగం మంది అధికారులు హైదరాబాద్‌లో ఉన్నారు. వారిలో ఒంగోలు కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని మున్సిపల్ అధికారులు, రెవెన్యూ ఉన్నతాధికారులు కూడా ఉండటం గమనార్హం. దాంతో జిల్లాలో వర్ష బాధితులకు సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు అధికారుల కొరత ఏర్పడింది. జిల్లా కేంద్రం ఒంగోలులో పరిస్థితి మరీ దయనీయంగా మారింది. సహాయ కార్యక్రమాలు అందించేవారు లేకపోవడంతో ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఒంగోలు జయప్రకాష్ కాలనీ, నెహ్రూ నగర్ వాసులు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కలెక్టర్ విజయకుమార్ కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూం ఏర్పాటు చేసి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆయన ఒంగోలులోని గుర్రం జాషువా కాలనీలో బుధవారం సాయంత్రం పర్యటించి బాధితులను పరామర్శించారు.
సహాయక చర్యల్లో వైఎస్సార్‌సీపీ
వైఎస్సార్‌సీపీ నేతలు వర్ష బాధితులకు అండగా నిలిచారు. హైదరాబాద్‌లో ఉన్న ఎమ్మెల్యే బాలినేని తక్షణం స్పందించారు. వర్ష బాధిత ప్రాంతాల ప్రజలకు ఆహారం పంపిణీతో పాటు ఇతర సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బాలినేని గురువారం ఒంగోలులో వర్ష బాధితులను పరామర్శించనున్నారు.
గుండెకోత!
Published Thu, Oct 24 2013 4:30 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM
Advertisement
Advertisement