బరితెగించారు..
- రేణిగుంట చెక్‌పోస్టు వద్ద దారుణం
- పట్టుకోబోయిన సిబ్బందిపై దూసుకెళ్లిన లారీ
- ప్రయివేటు జవాన్ దుర్మరణం
రేణిగుంట: బడాస్మగ్లర్లు, అక్రమరవాణాదారులు బరితెగిస్తున్నారు. తమ వ్యాపారానికి అడ్డొస్తున్నా రన్న నెపంతో చెక్‌పోస్టుల్లో పని చేస్తున్న సిబ్బందిని హతమార్చేందుకు సిద్ధ పడుతున్నారు. జిల్లాలో మరెక్కడా చోటు చేసుకోని విధంగా సోమవారం రేణిగుంట చెక్‌పోస్టు వద్ద జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. రేణిగుంట ఆర్టీఏ చెక్‌పోస్టులో సాంబశివ (47) ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆగకుండా వేగంగా వెళ్లిన లారీని పట్టుకోడానికి యత్నించి తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. ఎర్రచందనం లోడుతో కర్ణాటకకు వెళ్తున్న లారీనే సాంబశివను ఢీకొట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనతో జిల్లాలోని చెక్‌పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న కిందిస్థాయి ఉద్యోగుల్లో ప్రాణభయం మొదలయింది. పట్టపగలే ఇలాంటి దారుణానికి ఒడిగట్టారంటే రాత్రుల్లో ఇంకెంతటి కిరాతకానికి పాల్పడతారోనన్న ఆందోళన నెలకొంది. చెక్‌పోస్టుల్లో వాహనాలు ఆగకుండా వెళితే వాటిని పట్టుకోడానికి ప్రత్యేక వాహనం ఉంటే ఇలాంటి సంఘటన జరిగి ఉండేది కాదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన.
ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద మృతదేహంతో ధర్నా
అక్రమ రవాణా లారీ ఛేజింగ్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన స్థానిక ఆర్టీఏ చెక్‌పోస్టు ప్రయివేటు జవాన్ సాంబశివ కుటుంబాన్ని ఆదుకోవాలని అతని బంధువులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. రేణిగుంటలోని రామకృష్ణాపురానికి చెందిన సాంబశివ, హోంగార్డు సోమవారం అధిక లోడ్‌తో వెళుతున్న లారీని ఛేజింగ్ చేయగా, నాయుడుపేట-పూతలపట్టు రహదారిలో తూకివాకం వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఆ లారీ ఢీకొని వెళ్లడంతో అతడు మృతిచెందాడు. అనంతరం ఎస్‌ఎన్‌పురం, రామకృష్ణాపురం వాసులు కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి చెక్‌పోస్టు వద్ద అతని మృతదేహంతో ధర్నా నిర్వహించారు. సాంబశివ కుటుంబసభ్యులను ఆర్థికంగా ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ైబె ఠాయించారు. ఆర్టీఏ చెక్‌పోస్టులో ఇన్‌చార్జి అధికారిగా పనిచేస్తున్న ఎంవీఐ శివప్రసాద్, రేణిగుంట అర్బన్, రూరల్ సీఐలు బాలయ్య, సాయినాథ్ బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ధర్నా విరమింపజేశారు.
జీవనాధారం కోల్పోయిన కుటుంబం
సాంబశివ మృతితో అతని కుటుంబం జీవనాధారాన్ని కోల్పోయింది. మృతి చెందిన సాంబశివకు భార్య విమల, ఇద్దరు కమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె యోజన ఇంటర్మీడియట్, చిన్న కుమార్తె జ్యోత్స్న తొమ్మిదో తరగతి, కుమారుడు ఉదయ్‌కుమార్ ఆరో తరగతి చదువుతున్నారు. చెక్‌పోస్టులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ బిడ్డలను చదివిస్తూ వచ్చాడు. అతని మృతితో కుటుంబసభ్యులు బోరున రోదిస్తున్నారు.