రెడ్ సిగ్నల్..! | Red signal..! | Sakshi
Sakshi News home page

రెడ్ సిగ్నల్..!

Published Wed, Jul 9 2014 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

రెడ్ సిగ్నల్..!

రెడ్ సిగ్నల్..!

కడప అర్బన్/వైవీయూ : ఎన్‌డీఏ సర్కారు ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్‌లో వైఎస్‌ఆర్ జిల్లా రైల్వే ప్రాజెక్టులకు రెడ్‌సిగ్నల్ పడింది. జిల్లాలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పలు రైల్వేలైన్లు, ప్రాజెక్టులపై రైల్వే మంత్రి సదానందగౌడ ఎటువంటి కనికరం చూపలేదు. బ్రిటీష్ పాలకుల హయాంలో ఏర్పాటు చేసిన రైలు మార్గాలు మినహా జిల్లాకు మరో రైలు మార్గం ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదంటూ చెప్పకనే చెప్పారు.
 
 నందలూరులో రైల్వేపరిశ్రమను తీసుకువస్తామని గతంలో పలుమార్లు చెప్పినా ప్రస్తుత కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేసిన దాఖలాలు కనపించడం లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సామాన్యుడికి మేలుచేస్తాడని అందలం ఎక్కిస్తే ఓవైపు చార్జీల మోత మోగిస్తూ మరోవైపు ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్తరైలు ఇవ్వకపోవడంతో పాటు ప్రారంభమైన మార్గాలను విస్మరించడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
 
 కడప- బెంగుళూరు మార్గం..
 కడప జిల్లా ప్రజల చిరకాలం వాంఛ అయిన కడప-బెంగుళూరు నగరాల మధ్య  రైల్వేలైను ఏర్పాటు చేసేందుకు గతంలో నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి రూ. 1784 కోట్లతో అంచనాలు వేశారు. 2010లో కడపను సందర్శించిన రైల్వేశాఖ సహాయమంత్రి మునియప్ప సైతం ఈ మార్గాన్ని 5 సంవత్సరాల్లో పూర్తిచేస్తామని ప్రకటించారు. అయితే ఆయన ప్రకటించి నాలుగు సంవత్సరాలు పైగా కావస్తున్నా ఎటువంటి పురోగతి లేదు. కేవలం కడప -పెండ్లిమర్రి మధ్య 23 కిలోమీటర్ల మేర మాత్రమే రైల్వేలైను ఎర్త్‌పనులు పూర్తయ్యాయి.
 
  ఈ రైల్వేలైను పనుల పట్ల అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వ సమానభాగస్వామ్యంతో నిర్మించడానికి సిద్ధం చేశారు. 2009-10 సంవత్సరానికి రూ. 1 కోటి, 2010-11 సంవత్సరానికి రూ. 58 కోట్లు (29+29), 2011-12 సంవత్సరానికి రూ. 100 కోట్లు (50+50), 2012-13 సంవత్సరానికి రూ. 38 కోట్లు, 2013-14 సంవత్సరానికి రూ. 70 కోట్లు మాత్రమే మంజూరయ్యాయి. మొ త్తం మీద రూ. 230 కోట్లు నిధులు మాత్రమే విడుదల కావడం గమనార్హం. తాజాగా విడుదలైన ఈ బడ్జెట్‌లో ఎటువంటి నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పనులు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదు.
 
 అటకెక్కిన సర్వేలు...
 ప్రొద్దుటూరు-కంభం మధ్య 130కిలోమీటర్ల మేర రూ. 800 కోట్లతో రైలు మార్గానికి సర్వేలు చేశారు. గత బడ్జెట్‌లో అనుమతి లభించినా ఈ సారి నిధులు కేటాయించకపోవడంతో సర్వేదశలోనే నిలిచిపోనుంది. అదే విధంగా భాకరాపేట-గిద్దలూరు మధ్య రైల్వేమార్గం సిద్ధవటం, బద్వేలు, పోరుమామిళ్ల మీదుగా నిర్మించేందుకు సర్వేచేపట్టిన సర్వేలకు సైతం నిధులు లేకపోవడంతో ముందుకువెళ్లే అవకాశం లేకపోయింది.
 
 చెదిరిన కల..
 రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి కొత్తరైల్వేజోన్‌తో పాటు మెట్రోరైళ్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేంద్రం పునర్విభజన బిల్లులోని ఏ అంశాన్ని పట్టించుకోకపోవడం దారుణం. ఏపీ రైల్వే అభివృద్ధికి కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ప్రకటించడం పట్ల కమిటీలు అంటే విసిగిపోయిన సీమాంధ్రులు విశ్వసించడం లేదు. వారానికి ఒక్కరోజు వచ్చే రైళ్లను కూడా డైలీరైళ్లుగా మార్చకపోవడం పట్ల ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 ఊసేలేని ఓబులవారిపల్లె - కృష్ణపట్నం మార్గం..
 ఓడల అనుసంధానానికి నిధులు విడుదల చేసిన మంత్రి ఓబులవారిపల్లె-కృష్ణపట్నం పోర్టు మార్గానికి పైసా కూడా విదల్చలేదు. వీటి మధ్య 113 కిలోమీటర్ల రైలుమార్గానికి రూ.930 కోట్లు అంచనావేశారు. దీనికోసం 2012-13లో రూ. 6 కోట్లు, 2013-14లో రూ. 96.9 కోట్లు విడుదల చేశారు. అయితే కేవలం 10 కిలోమీటర్ల ఎర్త్‌వర్క్ మాత్రమే జరగడం గమనార్హం. ఈ మార్గం సిద్ధమైతే నెల్లూరు మీదుగా విజయవాడ వెళ్లేందుకు మార్గం దగ్గరవుతుంది. కాగా కృష్ణపట్నంపోర్టు ప్రాంత అభివృద్ధికి నిధులు విడుదల చేసిన కేంద్రం ఓబులవారిపల్లె-కృష్ణపట్నం మార్గానికి నిధులు ఇవ్వకపోవడం శోచనీయం. ఈ మార్గానికి అధిక నిధులు ఇవ్వాల్సి ఉన్నా దీని ఊసే లేకపోవడం విచారకరం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement