సాక్షి, అమరావతి: కేపీ ఉల్లి ఎగుమతుల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు కేంద్రంపై తీసుకువచ్చిన వత్తిడి ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాల ఉల్లి రైతులకు ప్రయోజనం చేకూర్చుతోంది. కేవలం విదేశాలకు ఎగుమతి చేయడానికి వైఎస్సార్ జిల్లాలోని రైతులు చిన్నసైజు రకం ఉల్లిని సాగు చేస్తే.. అప్పట్లో కేంద్రం ఎగుమతులపై విధించిన నిషేధం ఈ రైతుల పాలిట శాపంగా మారింది. వారి కష్టాలను వైఎస్సార్‌సీపీ ఎంపీలు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను పలుమార్లు కలిసి వివరించారు. ఒక్క కేపీ ఉల్లి గురించే కాకుండా ఎగుమతుల నిషేధం వలన ఉల్లి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నివేదించారు. తొలుత కేపీ ఉల్లి ఎగుమతికి అనుమతి ఇచ్చిన కేంద్ర మంత్రి ఈ నెల 15న దేశంలోని అన్ని రకాల ఉల్లిని విదేశాలకు ఎగుమతి చేయడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉల్లి రైతుల సమస్య ఇలా...
- గత నవంబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు దేశంలో ఉల్లి ధరలు అనూహ్యంగా పెరిగాయి.
- కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసి, నాఫెడ్ ద్వారా రాష్ట్రాలకు సరఫరా చేసింది.
- స్ధానిక అవసరాలకు మించి దిగుబడులు రావడంతో ధరలు పడిపోయాయి. హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.15 నుంచి రూ.18 మించి పలకడంలేదు.
- కొన్ని నగరాల్లో కిలో రూ.150 నుంచి రూ.170 వరకు దర పలికింది.
- ధరల తీరును గమనించిన రైతులు రబీలో భారీగా ఉల్లి సాగు చేశారు.
- ఈ ధర మరింత పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్ధితులు ఉన్నాయని మార్కెటింగ్‌శాఖ గుర్తించి నివేదిక ఇచ్చింది.
- ఇదే విషయాలతో పాటు ఐదేళ్లుగా నష్టపోతున్న కేపీ ఉల్లి రైతుల విషయాలను వైఎస్సార్‌సీపీ ఎంపీలు పలుమార్లు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
- తక్షణం ఎగుమతులకు అనుమతి ఇస్తే ధరలు పెరిగి రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.
- ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మొదట కేపీ ఉల్లి ఎగుమతులకు అంగీకరించింది. ఆ తర్వాత మిగిలిన ఉల్లి విషయంలోనూ సానుకూలంగా స్పందించింది.
- మహారాష్ట్ర, కర్ణాటక ఉల్లి ప్రధానంగా ఎగుమతులకు వెళుతుంది. దాని వల్ల మన రాష్ట్రంలోని ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment