కొలువులు ఖాళీ
కొత్త వారు చేరికెప్పుడో?
ఖాళీ పోస్టుల భర్తీ అయ్యేదెన్నడో?
ఇంఛార్జిలతో కుంటుపడుతున్న పాలన
విశాఖపట్నం: వేళ కాని వేళ లో సర్కార్ బదిలీలు చేపట్టింది. పై రవీలతో కొంతమంది, అయిష్టం గా మరి కొంతమంది కదిలారు. కోరుకున్న పోస్టులను దక్కించుకున్నారు. తీరా దక్కించు కున్న సీట్లలో చేరేందుకు మాత్రం రోజులు కాదు..వారాలు గడిచి పోతు న్నాయి. దీంతో కీలక శాఖల్లో పాలన కుంటుపడుతోంది. జిల్లా పాలన యంత్రాం గానికి మూల స్తంభమైన జిల్లా రెవెన్యూఅధికారి(డీఆర్వో) పోస్టు ఖాళీ అయిపోయి నెలన్నర దాటి పోయింది.అప్పటి నుంచి జేసీ-2 డి.వెంకటరెడ్డి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. తాజా బదిలీల్లో కడప జేసీ-2గా పనిచేస్తున్న సి.చంద్ర శేఖరరెడ్డిని ప్రభుత్వం ఇక్కడ నియమించింది. ఉత్తర్వులువెలువడి పదిరోజులు దాటి పోయినా నేటికీ ఆయన విధుల్లో చేర లేదు. ఆయన స్థానంలో నియమితులైన అధికారి కడప జేసీగా విధుల్లో చేరకపోవడంతో ఆ జిల్లా కలెక్టర్ ఆయనను రిలీవ్ చేయడం లేదంటున్నారు. కానీ రెవెన్యూలో మరో వాదన వినిపిస్తోంది. డీఆర్‌వోగా చంద్రశేఖరరెడ్డి నియామకాన్ని జిల్లాలో ఓ మంత్రి వ్యతిరే కిస్తున్నారని..తనకు అనుకూలంగా ఉండే అధికారిని తెచ్చుకునేందుకు ఇంకా ప్రయత్నాలు సాగిస్తున్నారని చెబుతున్నారు.
మరొక పక్క కీలకమైన అర్బన్ పౌరసరఫరాలశాఖకు కూడా ఆర్నెళ్లుగా నాధుడుల్లేని పరిస్థితి. ఇక్కడ పనిచేసిన రవితేజనాయక్‌ను తెలంగాణాకు పంపారు. రూరల్ డీఎస్‌ఒ జే.శాంతకుమారి ఇన్‌చార్జిగా విధులు నిర్వహిస్తున్నారు. తాజా బదిలీల్లో ఈమె కూడా వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు సాగించారు.విజయనగరం జిల్లా డిఎస్‌వో నిర్మలాబాయిని అర్బన్ డీఎస్‌వోగా ఈ నెల 12న ప్రభుత్వం బదిలీ చేసింది. పదిరోజులు దాటినా ఈమె కూడా ఇక్కడ విధుల్లో చేరలేదు. కాగా మరో ఇద్దరు అధికారులు ఈ పోస్టు కోసం ప్రయత్నాలు సాగిస్తుండడం ఈ జాప్యానికి కారణమన్న వాదన వ్యక్తమవుతోంది. ఇక సోషల్ వెల్ఫేర్ డీడీగా ఎవరిని నియమించకుండానే ఇక్కడ పనిచేస్తున్న డివి రమణ మూర్తి విజయనగరం డీడీగా బదిలీ చేశారు. ఈయన ఇంకా రిలీవ్ కాలేదు. కనీసం వచ్చి ఏడాది కాకుండానే బదిలీకి గురైన రమణ మూర్తి ఇక్కడకొనసాగేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలియవచ్చింది. ఇక ఖాళీగా ఉన్న వివిధ పోస్టులు తాజా బదిలీల్లోనైనా భర్తీఅవుతాయని ఆశించారు. కానీ జరగలేదు. బీసీకార్పొరేషన్‌ఈడీగా పనిచేస్తూ ఏసీబీవలలో చిక్కడంతో సస్పెండ్‌కు గురైన జీవన్ బాబు స్థానంలో కొత్తవారిని నియమించలేదు. ప్రస్తుతం బీసీ వెల్ఫేర్‌ఆఫీసర్ నాగేశ్వర రావు దీనికి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక డిప్యుటీట్రాన్స్‌పోర్టు కమిషనర్ (డీటీసీ)గా పని చేసిన కృష్ణయ్యను తెలంగాణాకు ఎటాచ్ చేసి రెండు నెలలుగా ఈపోస్టుఖాళీగా ఉంది. ఇటీవల రవాణాశాఖ అంతర్గత బదిలీలు జరుగుతు న్నప్పటికీ కీలకమైన డీటీసీ పోస్టు మాత్రం ఖాళీగానే ఉంది. ఐసీడీఎస్ పీడీగా వచ్చిన విజయలక్ష్మి విధుల్లోచేరి శిక్షణ పేరుతో ఢిల్లీ వెళ్లారు. ఇంకా తిరిగి విధుల్లోకి చేరలేదు. అటవీశాఖలో ఏపీ ఎఫ్‌డీసీ ఆర్‌ఎంతో పాటు అరకు సబ్ డివిజన్ డీఎఫ్‌వో పోస్టులు ఖాళీగాఉన్నాయి. సోషల్ ఫారెస్ట్ డీఎఫ్‌వోగా విజయనగరం నుంచి బదిలీపై వచ్చిన సూర్యనారాయణ పడాల్ ఇంకా విధుల్లో చేరలేదు. సమాచారశాఖలో డీడీతో పాటు డీపీఆర్‌వో పోస్టులు ఏళ్లతరబడి ఖాళీగానే ఉన్నాయి. ఇక ఏళ్ల తరబడి జిల్లాలో పాతుకు పోయిన కొందరు తమపై బదిలీవేటుపడకుండా రాజకీయ పలుకుబడినంతా ఉపయోగించి చక్రం తిప్పుతున్నారు.
రూ.లక్షలు కుమ్మరించి సీట్లు కాపాడుకునేందుకు యత్నిస్తున్నారు. మరొక పక్క ఏళ్లతరబడి ఇక్కడే పనిచేసి ఇటీవలే బదిలీ అయిన జెడ్పీ సీఈవో మహేశ్వరరెడ్డి ఖాళీగా ఉన్న బీసీ స్టడీ సర్కిల్ జాయింట్ డెరైక్టర్ పోస్టులోకి వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు.