ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రకాశం భవనంలోని ఓపెన్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌కు అర్జీదారులు పోటెత్తారు. ప్రజాదర్బార్‌కు అన్ని శాఖల అధికారులు ఉదయం పదిన్నర గంటలకల్లా హాజరయ్యారు. అప్పటికే ప్రజలు అర్జీలతో పెద్ద సంఖ్యలో బారులు తీరారు. అధికారులు మాత్రం అర్జీదారులను పట్టించుకోకుండా కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ కోసం ప్రకాశం భవనం ప్రధాన గేటువైపు చూస్తున్నారు. ఉదయం 11.42 గంటలకు కలెక్టర్ రావడంతో అప్పటి వరకు మౌనంగా కూర్చున్న జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్‌తోపాటు ఇతర అధికారుల్లో కదలిక వచ్చింది. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం ప్రారంభించారు. అర్జీదారుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు ఆదేశించారు.
రైతులను ఆదుకోవాలి
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అఖిల భారత రైతుకూలీ సంఘం నాయకులు కలెక్టర్‌ను కోరారు. జిల్లాలో 85 వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయన్నారు. పత్తి పంట కాపుదశలోనే నీట మునిగిందన్నారు. మిర్చి కోత దశలోనే ఉరకలెత్తి ఎండిపోయిందని చెప్పారు. వరి, పొగాకు, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయన్నారు. రైతులకు ఎకరాకు 25 వేల రూపాయల చొప్పున పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు.
సర్పంచ్‌పై విచారణ జరపాలి
చీరాల మండలం రామకృష్ణాపురం గ్రామ సర్పంచ్ ఎం లీలాకుమారి అవినీతి అక్రమాలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని మాజీ ఉప సర్పంచ్ ఎస్‌కే ఆజాద్ కోరారు. 2003 నుంచి 2008 వరకు సర్పంచ్‌గా ఉన్న సమయంలో ఆమె నిధులు దుర్వినియోగం చేశారన్నారు. ఆర్‌ఆర్ యాక్ట్ కింద రూ.6,36,153 రికవరీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పంచాయతీ కార్యాలయం పైఅంతస్తు పూర్తి చేయకుండా నిధులు దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
శ్మశానానికి స్థలం కేటాయించాలి
నాగులుప్పలపాడు మండలం చేకూరుపాడు ఎస్సీ కాలనీకి శ్మశాన స్థలం కేటాయించాలని కాలనీవాసులు కోరారు. ఊరికి తూర్పువైపున పాత శ్మశానానికి దారి లేకపోవడంతో మెయిన్ బజారులో నుంచి శవాలు తీసుకువెళ్తుంటే గ్రామస్తులు కొందరు అభ్యంతరం చెబుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
బోగస్ పట్టాలు రద్దు చేయాలి
రెండున్నర దశాబ్ధాల నుంచి సాగు చేసుకుంటున్న బంజరు భూమికి నల్గొండ జిల్లాకు చెందిన గణిత పద్మ, మోర్తాల పెంటారెడ్డి, మోర్తాల కృష్ణారెడ్డిలు బోగస్ పట్టాలు సృష్టిం చారని, ఆ పట్టాలు రద్దు చేయాలని త్రిపురాంతకం మండలం ఎండూరివారిపాలేనికి చెందిన ఎస్సీలు కోరారు. గ్రామ సరిహద్దులోని అన్నసముద్రం వద్ద సర్వే నం 217లో బంజరు భూమిని చదును చేసుకుని 28 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని తెలిపారు.
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ సుధాకర్, పీ రాంబాబు కోరారు. మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు కావడం లేద ని, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఆధార్ లింక్ పెట్టడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించాలి
పంచాయతీ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల జీతాన్ని వెంటనే చెల్లించాలని ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు కోరారు. తాము సమ్మెలో లేనప్పటికీ జీతాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. టంగుటూరు, స్వర్ణ, కురిచేడు, దొనకొండ, తరిమెళ్ల, ఇడుపులపాడు పంచాయతీల్లో నెలల తరబడి వేతనాలు బకాయిలో ఉన్నాయని చెప్పారు.
వికలాంగుల హాస్టల్‌కు వార్డెన్‌ను నియమించాలి
ఒంగోలులోని ప్రభుత్వ వికలాంగుల బాలుర వసతి గృహానికి అన్ని అర్హతలు కలిగిన వ్యక్తిని వార్డెన్‌గా నియమించాలని ఫిజికల్లీ హ్యాండీక్యాప్‌డ్ చాలెంజ్‌డ్ డెవలప్‌మెంట్ సొసైటీ జిల్లా కార్యదర్శి ఎస్‌కే కాలేషా కోరారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం డిగ్రీ, బీఈడీ లేదా ఎంఏ చదివిన వారిని వార్డెన్‌గా నియమించాల్సి ఉండగా, అర్హతలేని వ్యక్తిని నియమించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రజాదర్బార్‌కు వినతుల వెల్లువ
Published Tue, Nov 5 2013 4:51 AM | Last Updated on Sat, Sep 2 2017 12:16 AM
Advertisement