
'ప్రియురాలి భర్తను చంపాలని స్కెచ్ వేశాడు'
ప్రియురాలి భర్తను హతమార్చేందుకు ఓ పూజారి క్రిమినల్‌గా మారాడు. ఎలాగైనా తన ప్రియురాలిని దక్కించుకునేందుకు ఆమె భర్తను చంపాలని స్కెచ్ వేశాడు. అయితే, అతడి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇబ్రహింపట్నానికి చెందిన పూజారి రవిదత్తు, అతడి స్నేహితుడు సతీష్‌తో కలిసి అర్థరాత్రి విజయవాడ బస్టాండ్‌లో కాపు కాశాడు. తాను చంపాలనుకున్న వ్యక్తి కనిపించడంతో .. వెంటనే సులభ్ కాంప్లెక్స్ లోకి వెళ్లి రివాల్వర్‌లో బుల్లెట్స్ లోడు చేయబోయాడు.
ఆ హడావిడిలో గన్ మిస్ ఫైర్ అయ్యింది. దీంతో ఎదురుగా వేరే బాత్రూమ్‌లో ఉన్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వెంకటరమణ శరీరంలోకి బుల్లెట్ దూసుకుపోయింది. తాను చేసిన పొరపాటు ఏంటో అర్థమైన రవిదత్తు, అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించాడు. తూటా పేలిన శబ్ధం వినిపించడం, బాత్రూమ్ డోర్‌కు రంధ్రం కావడంతో పోలీసులు అతడిని అనుమానించి పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రివాల్వర్, బుల్లెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈలోగా .. అతడి ఫ్రెండ్ సతీష్ తప్పించుకున్నాడు. గాయపడిన వ్యక్తిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
విజయవాడ బస్టాండులోని 50వ ప్లాట్ఫారం బాత్రూం వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. పూజారి రవిదత్తును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లు ఉపయోగించిన రివాల్వర్ లైసెన్సు లేదని సమాచారం. అయితే అసలు వాళ్ల చేతికి రివాల్వర్ ఎలా వచ్చిందనే విషయమే పెద్ద సంచలనంగా మారింది. రివాల్వర్ను బీహార్లో కొన్నట్లు పూజారి రవిదత్తు పోలీసులకు వెల్లడించారు.