భోగాపురం: విమానాశ్రయ నిర్మాణానికి ఏకాదశి మంచిదని, అధికారులు ఇటీవల ఇచ్చిన ప్లాను ప్రకారం నిర్ణయించిన స్థలంలో ప్రాథమిక మార్కింగ్ చేసేందుకు వచ్చిన రైట్స్ బృందాన్ని ఎయిర్‌పోర్టు బాధిత గ్రామాల ప్రజలు తరిమికొట్టారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు స్థానిక రెవెన్యూ అధికారుల సహా కొంగవానిపాలెం రెవెన్యూ పరిధిలోని తూర్పుబడికి సోమవారం మధ్యాహ్నం రైట్స్ బృందం చేరుకుంది. అధికారులు ఇచ్చిన ప్లాను ప్రకారం ఆర్‌ఐ సత్యనారాయణ, సర్వేయరు సింహాచలం నాయుడులు వీఆర్‌ఓలు లక్ష్మణరావు, శ్రీనుల సహకారంతో ఈశాన్య దిశలో సర్వే నిర్వహించి ప్రాథమిక మార్కింగ్ (స్టార్టింగ్ పాయింట్)ను గుర్తించారు. అనంతరం ఈ విషయాన్ని సెలవులో తిరుపతి వెళ్లిన తహశీల్దారు డి.లక్ష్మారెడ్డికి ఫోన్ ద్వారా సర్వేయరు తెలియజేశారు.
సర్వే జరుగుతున్న విషయం తెలుసుకున్న స్థానిక గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని, మా భూముల్లో ప్లాన్లు వేసుకుని సర్వే చేసేందుకు మీరెవరు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్స్ బృంద సభ్యుడి వద్దనుంచి బ్యాగులు లాక్కుని అందులో ఉన్న ప్లాను పేపర్లను బాధిత గ్రామస్తులు చించి పారేశారు. ఎవరైనా భూముల్లోకి వస్తే ఊరుకునేది లేదని, మమ్మల్ని పిలకుండా, మాతో సంప్రదించకుండా సర్వేలు చేయడానికి మీరెవ్వరు, ఎన్నిసార్లు అడ్డగిస్తున్నా దొంగతనంగా వస్తూ మా సహనాన్ని పరీక్షిస్తున్నారు. మాపై కేసులు పెట్టి మమ్మల్ని జైళ్లలో పెట్టి మా భూములు తీసుకుందామనుకుంటున్నారేమో మిమ్మల్ని చంపి మేమూ అలాగే చేస్తాం అంటూ హెచ్చరించారు. అలాగే కో-ఆర్డినేటర్ ప్రసాద్‌ను సంఘటనా స్థలం వద్దనుంచి తరిమి కొట్టారు.
విషయం తెలుసుకున్న ఎయిర్‌పోర్టు నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, బెరైడ్డి ప్రభాకరరెడ్డి, శివారెడ్డి, ఎర్ర అప్పలనారాయణ, పట్న తాతయ్యలు, కొల్లి రామమూర్తి, మట్ట వెంకటరమణారెడ్డి తదితరులు అక్కడకు చేరుకుని ఆందోళన కారులను సముదాయించారు. దొంగచాటుగా సర్వేలు నిర్వహిస్తే ఊరుకునేది లేదని వీఆర్‌ఓలు, రైట్ బృంద సభ్యులను ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. ఎయిర్‌పోర్టుకి వ్యతిరేకంగా ఆరునెలలుగా నిరసన వ్యక్తం చేస్తున్నా పట్టించుకోకుండా సర్వేలు నిర్వహించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సీఐ వైకుంఠరావు, ఎస్‌ఐ దీనబంధులు సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే రెవెన్యూ సిబ్బంది అక్కడినుంచి వెళ్లిపోవడంతో పోరాట కమిటీ నాయకులు ఉప్పాడ తదితరులతో సీఐ చర్చించారు. విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను అడ్డగించడం సరికాదని, ఏదైనా ఉంటే సామరస్యంగా మాట్లాడాలని, ఒకసారి స్టేషనుకు రావాలని సీఐ కోరడంతో ఆందోళన సద్దుమణిగింది.
నాయకులతో సీఐ చర్చలు
పోలీస్ స్టేషన్‌లో చర్చిద్దామని సీఐ ఆహ్వానించడంతో వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టరు సురేష్‌బాబు, మాజీ ఎంఎల్‌ఏ బడ్డుకొండ అప్పలనాయుడు, ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, వరుపుల సుధాకర్, సుందర గోవిందరావులు సీపీఎం మండల కార్యదర్శి బి.సూర్యనారాయణ తదితరులు సోమవారం సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో సర్కిల్ కార్యాలయంలో సీఐతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గ్రామస్తులు, రైతులకు ఏదైనా సమస్య ఉంటే సామ రస్యంగా మాట్లాడుకోవాలి తప్ప విధుల్లో ఉన్న ఉద్యోగులకు అడ్డుతగలరాదని కోరారు. దీనిపై సురేష్ బాబు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులతో మాత్రమే విశాఖ, విజయనగరంలో సమావేశాలు పెట్టుకుని ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అధికారులు ప్రయత్నాలు చేయడాన్ని ఖండించారు. దీనిపై సీఐ ఆర్‌డీఓతో ఫోనులో సంప్రదించగా పోరాట కమిటీ నాయకులు తన కార్యాలయానికి రావాలని ఆయన కోరారు. జిల్లా కేంద్రంలో కాకుండా మండల కేంద్రంలో రైతులు, నాయకులతో ఆర్‌డీఓ సమావేశం ఏర్పాటుచేయాలని వారంతా కోరారు.
నాయకులపై కేసు నమోదు
సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకున్న ఎయిర్‌పోర్ట్ నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు, గ్రామస్తులపై కేసు నమోదు చేసినట్లు స్‌ఐ దీనబంధు తెలిపారు.
లెఫ్ట్..లెఫ్ట్
Published Tue, Jul 28 2015 1:13 AM | Last Updated on Sun, Sep 3 2017 6:16 AM
Advertisement
Advertisement