కాకానీనగర్ వద్ద ప్రమాదంలో మామ, అల్లుడు మృతి
అమ్మ.. నాన్నా ఎక్కడంటూ విలపిస్తున్న చిన్నారి
అక్కిరెడ్డిపాలెం: ఓ రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని కకావికలం చేసింది. ఆ కుటుంబానికి మగ దిక్కు లేకుండా పోయింది. మామ, అల్లుడు మృతి చెందడం ఆ కుటుంబాన్ని షాక్‌కు గురిచేసింది. ఆస్పత్రి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న కుమార్తె, అమ్మ.. నాన్న ఎక్కడంటూ విలపిస్తున్న మనుమరాలు.. అన్నింటికి మించి తన భర్త, అల్లుడి మృతితో ఆ తల్లి రోదనలు మిన్నంటాయి. ప్రమాద వార్త తెలిసిన వెంటనే వెంకటేశ్వరకాలనీలో విషాద చాయలు అలుముకున్నాయి.
కాకానీనగర్ వద్ద ఆదివారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో 65వ వార్డు వెంకటేశ్వరకాలనీకు చెందిన రెడ్డి అప్పలనాయుడు (57), అల్లుడు కంది ఎల్లారావు దుర్మరణం చెందారు. అప్పలనాయుడు కుమార్తె అనిత తీవ్ర గాయాలతో నగరంలో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాదంలో ఆమె ఎడమ కాలుకు తీవ్ర గాయాలు కాగా.. శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. సుందర్ వినాయక్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న అప్పలనాయుడు భెల్‌లో రేడియో గ్రాఫర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అల్లుడు హైదరాబాదులో హెచ్ అండ్ హెచ్ ఫార్మాసూటికల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఎల్లారావు స్వగ్రామం వాడచీపురుపల్లి. పండగకు వచ్చిన కుమార్తె అనిత, రెండేళ్ల మనుమరాలు భార్గవితో నాలుగు రోజుల పాటు ఆనందంగా గడిపారు. కుమార్తె, మనుమరాలు 10 రోజుల పాటు తల్లిదండ్రుల వద్ద ఉంటాననడంతో అల్లుడు హైదరాబాద్ వెళ్లేందుకు ఆదివారం బయలు దేరాడు. అతన్ని రైలు ఎక్కించడానికి స్టేషన్‌కు మామ, అల్లుడు, కుమార్తెలు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో కారు రూపంలో మృత్యువు కాకానీనగర్ వద్ద వారిద్దరిని కబళించింది.
డబ్బు, ల్యాప్‌టాప్ మాయం
జరిగిన ప్రమాద సమయంలో వీరి వెంట తీసుకువె ళ్లిన రూ.2.50లక్షల నగదు, ల్యాప్ టాప్ మాయమైందని అప్పలనాయుడు భార్య రెడ్డి సావిత్రి తెలిపారు. విజయవాడలో అల్లుడు స్థలం కొన్నారని, ఆ స్థల యజమానికి డబ్బు అందజేయడానికి బ్యాగులో ఆ సొమ్మును తీసుకెళ్లాడని చెప్పారు. ఆ సొమ్మతో పాటు ల్యాప్‌టాప్ కూడా మాయమైందన్నారు. పోలీసులు వీటి స్వాధీనం చేసుకున్నారా? లేదా ప్రమాదం జరిగిన ప్రాంతంలో వీటిని ఎవరైనా దొంగిలించారా అంటూ భర్త, అల్లుడును తలచుకుంటూ సావిత్రి విలపించారు. పలువురు భెల్ ఉద్యోగులు, యూనియన్ నాయకులు, కార్మికులు, అధికారులు, స్థానిక నాయకులు అప్పలనాయుడు ఇంటికి చేరుకుని అయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.