రూ.52.50లక్షల సొత్తు స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): తక్కువ ఫీజుకే మేనేజ్‌మెంట్ కోటాలో మెడికల్ సీట్లు ఇప్పిస్తానని పలువురిని మోసగించి రూ. కోట్లతో ఉడాయించిన కి‘లేడి’ని శనివారం రాత్రి రెండోనగర ఇన్‌స్పెక్టర్ వి. సుధాకర్‌రెడ్డి నాయుడుపేటలో అరెస్ట్‌చేశారు. పోలీసుల కథనం మేరకు...గుంటూరు బ్రాడీపేటకు చెందిన దద్దుకూరి లక్ష్మీపార్వతి, ఆదినారాయణ దంపతులు. వారు ఉపాధి నిమిత్తం కొన్నేళ్ల కిందట నెల్లూరు వచ్చారు. ఉస్మాన్‌సాహెబ్‌పేటలోని ఏడీఆర్‌లేఅవుట్‌లో నివాసం ఉండేవారు.
ఆదినారాయణ ఓ కళాశాలలో పార్ట్‌టైమ్ లెక్చరర్‌గా పనిచేసేవాడు. లక్ష్మీపార్వతి సైతం గతంలో ఓ ప్రైవేటు కళాశాలలో పీఆర్‌వోగా పనిచేసింది. అనంతరం అక్కడ పనిమానివేసింది. కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు మెడికల్ కళాశాలల ఉద్యోగులతో పరిచయాలు ఏర్పరచుకొంది. వారి సహకారంతో మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ కోటాల కింద రాష్ట్రానికి చెందిన కొంతమందికి మెడికల్ సీట్లు ఇప్పించింది. కొంతకాలం కిందట తక్కువ ఫీజులతో మెడికల్ సీట్లు ఇప్పిస్తానని ఎస్‌ఎంఎస్‌లు, పేపర్ ప్రకటనలు ఇచ్చింది.
దీంతో గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన సుమారు 19 మంది ఆమెను సంప్రదించారు. తమ పిల్లలకు సీట్లు ఇప్పించాలని కోరారు. ఒక్కొక్కరి నుంచి రూ. 25 నుంచి 30లక్షలు ఇలా సుమారు రూ. 3కోట్లు వసూలు చేసింది. వారిని తన వెంట కర్నాటక రాష్ట్రం బెంగుళూరులోని వైదేహి, షియోగ సుబ్బయ్య మెడికల్ కళాశాలల వద్దకు తీసుకెళ్లింది. అక్కడ తనకు పరిచయమున్న ఉద్యోగుల ద్వారా కళాశాల యాజమాన్యాలతో మాట్లాడించేది.
నిజంగానే మెడికల్ సీట్లు వస్తాయని అందరూ భావించారు. నెలలు గడుస్తున్నా సీట్లు రాకపోవడంతో వారు కళాశాలలకు వెళ్లి ఆరాతీయగా అంతా బోగస్ అని తేలింది. దీంతో తీసుకొన్న నగదును తిరిగి చెల్లించాలని బాధితులు ఆమెపై ఒత్తిడి తెచ్చారు. సుమారు రూ. కోటి వరకు ఆమె తిరిగి చెల్లించింది. ఇక డబ్బులు లేవని రాత్రికి రాత్రే ఉడాయించింది. ఈ నేపథ్యంలో తమకు జరిగిన మోసంపై పలువురు బాధితులు జిల్లా ఎస్పీ ఎస్ సెంథిల్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన తక్షణమే కేసు నమోదు చేయాలని రెండోనగర పోలీసులను ఆదేశించారు. నర్సారావుపేటకు చెందిన కె.వి రామకృష్ణ తన కుమార్తెకు మెడికల్ సీటు ఇప్పిస్తానని రూ. 25లక్షలు తీసుకొని మోసగించిందని లక్ష్మీపార్వతిపై ఫిర్యాదు చేశారు. గతేడాది నవంబర్ 8వ తేదిన లక్ష్మీపార్వతిపై చీటింగ్ కేసు నమోదు చేశారు.
ప్రకాశం జిల్లా పొదిలికి చెదిన ఐ. ఆదినారాయణ సైతం రూ. 8లక్షలు తీసుకొని మోసగించిందని ఫిర్యాదు చేయడంతో అదేనెల 28వ తేదిన మరో కేసు నమోదు చేశారు. నగర డీఎస్పీ ఎస్ మగ్బుల్ సారధ్యంలో ప్రత్యేక బృందం ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఈనేపథ్యంలో బాధితురాలు నాయుడుపేటలోని తమ బందువుల ఇంట్లో ఉందన్న సమాచారం అందుకున్న రెండోనగర ఇన్‌స్పెక్టర్ వి. సుధాకర్‌రెడ్డి శనివారం రాత్రి నిందితురాలిని అరెస్ట్‌చేశారు. ఆమె నుంచి సుమారు రూ. 52.50లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని కోర్టుకు తరలించారు.
దళారులను నమ్మవద్దు....
మెడికల్ కళాశాలలో సీట్లు ఇప్పిస్తామని ప్రకటనలు గుప్పించి దళారులను నమ్మి మోసపోవద్దని ఇన్‌స్పెక్టర్ వి. సుధాకర్‌రెడ్డి సూచించారు. ఎన్‌ఆర్‌ఐ, మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లు పొందగోరేవారు నేరుగా కళాశాల యాజమన్యాలను సంప్రదించాలన్నారు.
కి‘లేడీ’ అరెస్టు
Published Sun, Mar 15 2015 2:46 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement