నెల్లూరు (దర్గామిట్ట): ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు మృత్యుశకటాలుగా మారుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం మత్తు వెరసి ప్రయాణికుల పాలిట శాపమవుతోంది. గతంలో ఎక్కువగా లారీల వల్లే ప్రమాదాలు జరిగేవి. అప్పట్లో ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణం అంటే సురక్షితమనే భావన ఉండేది.
పస్తుతం పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. జిల్లా పరిధిలోని కోమిట్ల ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మద్యం మత్తును ప్రయాణికులు గుర్తించి బోదనం టోల్‌గేట్ వద్ద పోలీసులకు అప్పగించారు. అలాగే మద్యం మత్తులో బస్సు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్‌ను సంగం వద్ద పోలీసులకు అప్పగించిన ఘటనలను పరిశీలిస్తే ప్రయాణికులు ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నారో అర్థమవుతుంది. రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ ఆదాయం పెంచడం, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం, ప్రమాదాలను జీరోస్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల ప్రణాళిక చేపట్టింది. ఈ నెల 7 నుంచి ఆర్టీసీ అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వందరోజుల ప్రణాళికలో భాగంగా ఆయా డిపోల్లో పరిశుభ్రత కొంత కనిపించినా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పరిపాటిగా మారింది. జిల్లాలో అన్ని డిపోల్లో కలిపి దాదాపు 860 బస్సులు ఉన్నాయి. దూరపు సర్వీసుకు డ్రైవర్‌గా వెళ్లేవారి ఆరోగ్యాన్ని ఒకసారి పరీక్షించాల్సి ఉంటుంది.
అలాగే డ్యూటీకి ఎక్కేటప్పుడు బ్రీత్ ఎన్‌లైజర్‌తో పరీక్షించినా దారిలో ఎక్కడా తనిఖీలు చేస్తున్న దాఖలాలు లేవు. దీంతో బస్సు డ్రైవర్ రోడ్డు మార్గంలో దాబాల్లో ఎంచక్కా మద్యం సేవించి బస్సు నడుపుతున్నారు. దీంతో ప్రయాణంలో ప్రాణాలకు రక్షణ కరువవుతోంది. రవాణా, పోలీసు, ఆర్టీసీ చెకింగ్ స్క్వాడ్ అధికారుల తనిఖీలు నామమాత్రంగా ఉండటంతో డ్రైవర్లు మద్యం తాగేందుకు ఆసక్తి కనబరుస్తున్నారనేది వాస్తవం.
కఠినంగా లేని శిక్షలు: మద్యం మత్తులో బస్సు నడిపారని రుజువైనా శిక్షలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. కేవలం సస్పెండ్ చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. గత మూడేళ్లలో జిల్లాలో దాదాపు 70 మందికిపైగా డ్రైవర్లు మందు తాగి బస్సులు నడిపినట్టు అధికారులు చెబుతున్నారు. మద్యం సేవించారని రుజువైతే డ్రైవర్ లెసైన్స్ రద్దుతో పాటు జైలుశిక్ష పడేలా చట్టాలు ఉన్నట్టైతే తప్పు చేసేందుకు భయపడతారనేది వాస్తవం.
ప్రైవేటు బస్సుల్లోనూ ఇంతే.. : ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు కూడా మద్యం మత్తులోనే నడుపుతూ ప్రమాదాలకు గురి చేస్తున్నారు. ప్రైవేటు బస్సుల్లో కనీస నిబంధనలు కూడా పాటించడంలేదు. ఐదేళ్ల అనుభవం ఉన్న డ్రైవర్‌ను నియమించాలి. దూరపు ప్రాంతాలకు వెళ్లే బస్సులో రెండో డ్రైవర్ తప్పకుండా ఉండాలి. డ్రైవర్‌కు తప్పని సరిగా బెర్త్‌ను ఏర్పాటు చేయాలి. బస్సు కండీషన్, డ్రైవర్ ఆరోగ్య పరిస్థితిని ట్రావెల్స్ యజమానులు ఎప్పటికప్పుడు తప్పని సరిగా పరీక్షించాలి. ఇవేవీ పట్టని యజమానులు స్వలాభం కోసం బస్సులను నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలను గాల్లో కలుపుతున్నారు.
అధికారుల నిఘా అంతంత మాత్రమే : ప్రైవేటు బస్సుల ఆగడాలను నియంత్రించాల్సిన రవాణా అధికారులు ఆమ్యామ్యాలతో మిన్నకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బస్సులు కండీషన్‌లో లేన్నా, డ్రైవర్‌కు లెసైన్స్ లేకున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. బెంగళూరు వెళ్తున్న కోమటిట్రావెల్స్ బస్సును మద్యం మత్తులో డ్రైవర్ నడుపుతూ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ డ్రైవర్‌కు కనీసం లెసైన్స్ కూడా లేక పోవడం గమనార్హం.
మద్యం సేవించినట్టు గుర్తించాం
సంగం వద్ద ప్రయాణికులు పట్టించిన డ్రైవర్ మద్యం సేవించినట్టు గుర్తించాం. బ్రీత్ ఎన్‌లైజర్‌తో ఆయన్ను పరీక్షించాం. ఆయన్ను సస్పెండ్ చేసి, ఆ తర్వాత విచారణ చేపడతాం.
చంద్రశేఖర్, ఆర్టీసీ, సీటీఎం
వామ్మో..బస్సులు
Published Thu, Jul 17 2014 2:49 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement