నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: అక్రమంగా రాకపోకలు సాగిస్తున్న ప్రైవేటు బస్సుల బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. అయితే పట్టుబడిన బస్సులు కొన్నేనని, పెద్ద సంఖ్యలో బస్సులు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయని సమాచారం. జిల్లాలో రెండు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు ఇప్పటి వరకు నాలుగు బస్సులనే సీజ్ చేశారు. ఉదయం రెండు గంటల పాటు మాత్రమే తనిఖీలు నిర్వహిస్తుండటం అక్రమంగా బస్సులు నడుపుతున్న వారికి అనుకూలంగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రైవేటు బస్సు దగ్ధమైన ఘటనలో 45 మంది సజీవ దహనం కావడంతో జిల్లాలోని రవాణా శాఖ అధికారులు మేలుకున్నారు.
గురు,శుక్రవారాల్లో జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించారు. గురువారం కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఒక బస్సును కోవూరు వద్ద సీజ్ చేశారు. ఈ బస్సుకు స్టేజి క్యారియర్‌గా పర్మిట్ పొంది ఊరూరా ప్రయాణికులను ఎక్కించుకుంటున్నట్లు గుర్తించారు. శుక్రవారం కోవూరు వద్ద కామాక్షి ట్రావెల్స్, కేఎంబీ ట్రావెల్స్ బస్సులను స్వాధీనం చేసుకున్నారు. రూట్ పర్మింట్ లేకుండా రాకపోకలు సాగిస్తున్న బస్సు (ఆరెంజ్ ట్రావెల్స్) తడ మండలం భీమునివారిపాళెం చెక్‌పోస్టు వద్ద అధికారులకు చిక్కింది. ఇప్పటివరకు దొరికింది ఈ నాలుగు బస్సులు మాత్రమే. మరెన్నో బస్సులు నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై దూసుకుపోతున్నాయి.
రవాణా శాఖ అధికారులు తనిఖీల ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తే అక్రమంగా సాగిపోతున్న మరిన్ని బస్సుల అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. నెల్లూరు నుంచి వివిధ ప్రాంతాలకు సాగిస్తున్న బస్సుల ఫిట్‌నెస్, ఇతర పత్రాలు తదితర అంశాలపై ప్రజల్లో అనుమానాలు నెలకొనివున్నాయి. అధికారులు పకడ్బందీగా తనిఖీలు నిర్వహించి, అక్రమంగా నడుస్తున్న బస్సులను పూర్తిగా అడ్డుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
అక్రమ బస్సులు మరెన్నో..
Published Sat, Nov 2 2013 5:40 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement