నిశ్చితార్థం ఇంట చావు మెతుకులు పెడతారా? | RTC driver's committed suicide sparks protests in Vizag | Sakshi
Sakshi News home page

మిన్నంటిన రోదనలు..అట్టుడికిన డిపో

Published Sun, Nov 25 2018 1:10 PM | Last Updated on Sun, Nov 25 2018 1:11 PM

RTC driver's committed suicide sparks protests in Vizag  - Sakshi

గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): సింహాచలం ఆర్టీసీ డిపో కార్మికుల ఆగ్రహావేశాలతో అట్టుడికింది. డిపో డ్రైవర్‌ చింతా నాగేశ్వరరావు ఆత్మహత్య ఘటనతో రవాణా వ్యవస్థ స్తంభించింది. సుమారు 110కి పైగా బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. బాధిత కుటుం బం రోదనలు మిన్నంటాయి. నాగేశ్వరరావు ఆత్మహత్య సం ఘటన ఆయన కుటుంబంలోనే కాదు.. కార్మికుల్లో కల్లోలం రేపింది. ఇంటికి వెలుగుని కోల్పోయిన దుఃఖంలో కుటుంబం రోడ్డున పడితే.. ఆ కష్టం మరే కుటుంబానికీ రాకూడదని డిపో కార్మికులంతా ఆ గుండె పగిలే బాధ తామంతా పడుతున్నామని చెబుతూ శనివారం వేకువజాము నుంచి డిపో మొత్తంగా బస్సులు ఆపేశారు. నాగేశ్వరరావు భార్యాపిల్లలు, బంధువుల రోదనలు.. డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ కార్మికుల ఆందోళనలతో డిపోలో వాతావరణం వేడిక్కింది. ఇలాంటి ఆందోళన ఆర్టీసీ చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా జరిగింది. 

డిపోలో మిన్నంటిన రోదనలు
తెల్లారేసరికి బస్సుల హారన్లతో సందడిగా కనిపించాల్సిన సిం హాచలం ఆర్టీసీ డిపో రోదనలతో నిండిపోయింది. వేకువజా మున బస్సులు కదలాల్సిన సమయానికి నాగేశ్వరరావు భార్య అమ్మాజీ, ఇద్దరు కుమారులు, పెద్ద సంఖ్యలో బంధువులతో డిపోకు చేరుకుని గేటు వద్ద భైఠాయించారు. వారి రోదనలతో డిపో శోకసంద్రమైపోయింది. బస్సులతో వెళ్లాల్సిన డ్రైవర్లు, కండక్టర్ల గుండెలు బరువెక్కిపోయాయి. యూనియన్లు, వర్గాలకు అతీతంగా నిరసన చెబుతూ నల్ల బ్యాడ్జీలు ధరించారు. నాగేశ్వరరావు భార్యా పిల్లలకు సంఘీభావంగా నిలిచారు. 

మూకుమ్మడి బంద్‌తో నివ్వెరపోయిన పోలీసులు
అసలే శనివారం.. అందులోనూ యాత్రికుల తాకిడి.. ఇక్కడి నుంచి కదలాల్సిన బస్సులు 110 పైగానే. ఈ బస్సులన్నీ వేకువజాము నుంచే నిలిచిపోయాయని తెలిసి గోపాలపట్నం సీఐ పైడియ్య, ఎయిర్‌పోర్టు జోన్‌ సీఐ మళ్ల శేషు, పెందుర్తి సీఐ సూర్యనారాయణ, ఎస్‌ఐలు తమ్మినాయుడు, జి.డి.బాబు, పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలతో సహాయ పోలీసు కమిషనర్‌ అర్జున్‌ చేరుకున్నారు. కార్మికులకు నచ్చజెప్పి గేటు నుంచి పంపే ప్రయత్నం చేశారు. నాగేశ్వరరావు కుటుంబానికి న్యా యం జరిగే వరకూ ఇక్కడి నుంచి బస్సులను తీయలేమని  డ్రైవర్లు, కండక్టర్లు భీష్మించారు. మూకుమ్మడి బంద్‌తో పోలీ సులు నివ్వెరపోయారు. దీంతో ఏసీపీ అర్జున్‌.. ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ సుధేష్‌కుమార్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. కార్మికుల ఆందోళనతో సాయంత్రం 6 గంటల వరకూ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. దీంతో సింహాచలం వెళ్లే యాత్రికులు, భక్తులు, సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆటోలే దిక్కయ్యాయి.

లిఖిత పూర్వక హామీ కోసం పట్టు
బాధిత కుటుంబానికి హామీ ఇచ్చి బస్సులను నడిపించాలని ఆర్‌ఎం సుధేష్‌కుమార్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సీపీఎం నేత బలివాడ వెంకటరావు ఆధ్వర్యంలో కార్మికులంతా లిఖిత పూర్వక హామీ కోసం పట్టుబట్టారు. మీడియా ముందు చెబుతున్నా నమ్మరా.. అంటూ ఆర్‌ఎం విజ్ఞప్తి చేస్తే.. మీరూ రాజకీయనేతలా హామీలిస్తే విలు వేముందంటూ కార్మికులు ప్రశ్నించారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ చర్చలు జరిపి ఎట్టకేలకు ఆర్‌ఎం లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. నాగేశ్వరరావుకు రావాల్సిన పరిహారాలను మూడు రోజుల్లో ప్రాసెస్‌ చేస్తామని, ఆయన కుమారుని విద్యార్హతను బట్టి తాత్కాలికంగా అవుట్‌ సోర్సింగ్‌లో ఉద్యోగం కల్పిస్తామని.. తదుపరి రెగ్యులర్‌ పోస్టు ఇప్పిస్తామని, పెన్షన్, బెనిఫిట్లు రెండు నెలల్లో సెటిల్‌ చేస్తామని ఆర్‌ఎం తన సంతకంతో ఉన్న లేఖ రాసిచ్చారు.

నేతల నిర్వాకంపై కార్మికుల ఆగ్రహం
సింహాచలం ఆర్టీసీ గ్యారేజి డిపోలో కొందరు నేతల వైఖరిపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌ఎం డిపోకు వచ్చాక పలువురు తీరు మారిపోయింది. అధికారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ సమస్యను నీరుగార్చే ప్రయత్నాలు చేయడంతో కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఆర్‌ఎం కోరిక మేరకు వెళ్లిపోవాలని పలువురు చెబుతుంటే.. లిఖిత హామీ ఎందుకు.. మాటిచ్చారు కదా.. పదండిపోదాం.. అంటూ కదిలించే ప్రయత్నాలు చేయడంతో కార్మికులంతా గ్రహించి, ఆ నాయకులకు వారంతా చీవాట్లు పెట్టారు.

మాకు దిక్కెవరు?
► నా భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడుకాదు
►నిశ్చితార్థం భోజనాలు తినాల్సిన ఇంట చావు మెతుకులు పెడతారా?
►రీజినల్‌ మేనేజర్, ఏసీపీల ఎదుట 
►నాగేశ్వరరావు భార్య అమ్మాజీ రోదన

‘నా కుమారుడి నిశ్చితార్థం భోజనాలు శనివారం పెడతానని బంధులతో చెప్పి ఇంటి నుంచి డ్యూటీకి వెళ్లిన తన భర్తను శవంగా పంపి.. తమకు చావుమెతుకులు పెడతారా?.. నా భర్త పది మందికి సాయపడే ధైర్యవంతుడు.. ఆత్మహత్య చేసుకునేటంత పిరికివాడు కాదు.. అన్యాయం జరిగిపోయిందయ్యా..’అంటూ ఏసీపీ అర్జున్, ఆర్టీసీ ఆర్‌ఎం సుధేష్‌కుమార్‌ల వద్ద చింతా నాగేశ్వరరావు భార్య అమ్మాజీ గుండెలవిసేలా రోదించింది. సింహాచలం ఆర్టీసీ గ్యారేజి డిపోలో తొలుత ఏసీపీ అర్జున్‌ ఆమెను పరామర్శించారు. తర్వాత వచ్చిన ఆర్‌ఎం ఎదుట ఆమె కన్నీటి పర్యంతమైంది. రోజూ తన ఎదురుచూసుకునే డ్యూటీకి వెళ్లే భర్త రాత్రయినా రాకపోవడంతో ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందానని.. కుటుంబానికి దిక్కయిన డిపోలోనే ఆత్మహత్య చేసుకున్నాడని కుమిలిపోయింది. తనకు, తన బిడ్డలకు దిక్కెవరని విలపించింది. నాగేశ్వరరావు చేసుకుంది ఆత్మహత్య కాదని.. మానసికంగా వేధించి మరణానికి కారణమయ్యారని బంధువులు, సీఐటీయూ నేత శీర రమణ ఆరోపించారు. దీనిపై ఆర్‌ఎం స్పందిస్తూ మంచి ఉద్యోగిని కోల్పోవడం తమకూ బాధగా ఉందని, తన వంతు బాధ్యతగా నాగేశ్వరరావు కుటుంబానికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

విచారణ జరుపుతాం : అర్జున్, ఏసీపీ
ఆర్టీసీ డ్రైవర్‌ నాగేశ్వరరావు ఆత్మహత్య ఘటనపై విచారణ జరుపుతామని ఏసీపీ అర్జున్‌ తెలిపారు. ఇక్కడ నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. జరిగిన ఘటనలో నాగేశ్వరరావు చేతిపై రాత, డిపోలో సంఘటన జరగడం వంటి పరిణామాలను పరిగణిస్తున్నట్లు చెప్పారు. డిపో మేనేజర్‌(డీఎం)ను అరెస్ట్‌ చేసి చర్యలు తీసుకోవాలని నాగేశ్వరరావు బంధువులు చేసిన డిమాండ్‌పై స్పందించారు. ఇక్కడ విచారణలో సందేహాలు వద్దని చెప్పడానికే మరో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు కేసుకు సంబంధించిన ఏసీపీ ప్రవీణ్‌కుమార్‌ కూడా దర్యాప్తులో భాగంగా ఉన్నారని తెలిపారు.

డీఎం వేధింపులు భరించలేకపోతున్నాం..
సింహాచలం డిపో మేనేజర్, స్క్వాడ్‌ల తీరుపై ఆర్‌ఎంకు ఫిర్యాదు సింహాచలం ఆర్టీసీ గ్యారేజీ డిపోలో డ్రైవర్‌ చింతా నాగేశ్వరరావు ఆత్మహత్య సంఘటన నేపథ్యంలో అలా ఒత్తిడికి గురైన కండక్టర్లు, డ్రైవర్లు ఆర్‌ఎం సుధేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. డిపో మేనేజర్‌ దివ్య తీరును భరించలేకపోతున్నామని ఏకరువు పెట్టారు. స్క్వాడ్ల పేరిట అధికారులు ప్రయాణికుల ఎదుట తీవ్రంగా అవమానిస్తున్నారని, మహిళా కండక్టర్లని కూడా చూడకుండా కుంగిపోయేలా వారి చర్యలు ఉంటున్నాయని ఆవేదన చెందారు. గతంలో ఇదే డిపోకు చెందిన డ్రైవర్‌ ఆర్‌పీ నాయుడు గాజువాకలో లారీ ట్రాలర్‌ కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఇప్పుడు నాగేశ్వరరావు పురుగుల మందు తాగి డిపోలోనే ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు. ఇలా అనేక మంది వారికి జరిగిన అవమానాలను ఆయనకు  వివరించారు. పలువురి బాధితుల మాటల్లోనే..

మెడకు బోర్డు తగిలించి తిప్పారు
నేను 28కే బస్‌ నడుపుతున్న సమయంలో 104 జంక్షన్‌ వద్ద రిక్వెస్టు స్టాప్‌లో విపరీతమైన రద్దీగా ఉండడం వల్ల ఆపలేదు. అక్కడ ఆ బస్సుకు స్టాప్‌ నిర్ణయించలేదు కూడా. బస్సు ఆపలేదని డీఎంకు ఎవరో ఫోన్‌ చేసి చెబితే నేను రెస్ట్‌ ఆఫ్‌లో ఉన్న రోజున డిపోకి పిలిచి మరీ నా మెడలో బోర్డు తగిలించారు. అలా ఎక్కడైతే బస్సు ఆపలేదో అక్కడ అందరినీ క్షమాపణ కోరుతూ డ్రైవర్లకు కనిపించేలా తిరగాలని ఆదేశించారు. ఆ రోజంతా అలా బోర్డు తగిలించుకుని అవమానంతో బాధపడ్డాను. 
– ఎం.ఎన్‌.రావు, డ్రైవర్‌

బస్సెక్కినా వేధింపులే..
బస్సులో ప్రయాణికులతో ఎంత జాగ్రత్తగా ఉండాలని అత్రుతగా ఉంటాం. అలాంటి తరుణంలో ఎవరో ప్రయాణికుల నుంచి వాట్సప్‌ ఫిర్యా దు వచ్చిందని డ్యూటీలో ఉండగానే ఫోన్‌ చేసి డీఎం వేధిస్తుంటారు. ఇలా ఒత్తిళ్ల వల్లే కేపీ నాయుడు, నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు.        
– వల్లీ, కండక్టర్‌

ప్రయాణికుల ఇళ్లకు పంపుతున్నారు..
బస్సులో చిల్లర సమస్య అందరికీ తెలిసిందే. పలు సందర్భాల్లో చిల్లర లేదని డ్యూ రాస్తే బస్సు దిగినప్పుడు ప్రయాణికులు మరచిపోయి డీఎంకు ఫోన్‌ చేస్తే వారి ఇళ్లకు వెళ్లి డ్యూ ఇచ్చేసి రమ్మని ఆదేశిస్తున్నారు. మహిళా కండక్టర్లని కూడా చూడడం లేదు. ఇలా 
అయితే ఎలా?.
– భవానీ, కండక్టర్‌

ఇంక్రిమెంట్‌ కట్‌ చేశారు..
నేవీ డే నాడు ట్రిప్‌లు పెంచారు. మరుసరి రోజు రాత్రి 12 గం టల వరకూ పని చేయలేనని చెబితే డీఎం అర్థం చేసుకోలేదు. ఓరోజు రెండు టికెట్లు మిస్సయ్యాయన్న కారణంతో మెమో ఇవ్వకుండా ఇంక్రిమెంట్‌ కట్‌ చేసేశారు. 
– బీవీ లక్ష్మి, కండక్టర్‌

బ్యాగులు చింపి మరీ తనిఖీలా..
స్క్వాడ్‌ అధికారులు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. కండక్టర్లేదో డబ్బులు వెనకేసుకుంటున్నారన్న అనుమానాలతో మహిళా కండక్టర్లని కూడా చూడడం లేదు. చేతిలో ఉన్న బ్యాగుల అరలను చింపేసి మరీ ప్రయాణికుల ముందు తనిఖీలు చేస్తున్నారు. నేను అలా అవమాన భారం పడ్డాను.  
– బి.ఎస్‌.రత్నం, కండక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement