రాజమండ్రి సిటీ: ఆర్టీసీ నష్టాలని అధిగమించేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నామని ఆ సంస్థ ఎండీ నండూరి సాంబశివరావు చెప్పారు. ఆదివారం ఆయన రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ గత ఏప్రిల్ నుంచి ఆగసు వరకూ రూ.120 కోట్ల నష్టం వాటిల్లిందని, సంస్థ నిర్వహణకు ఆస్తుల మీద అప్పులు చేయాల్సి వస్తోందని చెప్పారు. విజయవాడ కేంద్రంగా పాలన నిర్వహిస్తున్నామని, ఈ నెల 30 నాటికి 40 కొత్త ఓల్వో, స్కానియా బస్సులను ప్రతి డిపోనూ కలుపుతూ నడపనున్నామని తెలిపారు.
త్వరలో కండక్టరు ఉన్న ప్రతి బస్సులో పార్శిల్ సర్వీస్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఏటా 27 కోట్ల లీటర్ల డీజిల్ వాడుతుండగా దానిలో 20 శాతం బయోడీజిల్ అని చెప్పారు. బయో డీజిల్ వాడకం ద్వారా లీటర్‌కు మూడు రూపాయలు ఆదా అవుతుందన్నారు. ఆదాయం కోసం అద్దె బస్సులకు తామే డీజిల్ సరఫరా చేసే మార్గాన్ని అన్వేషిస్తున్నామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ హాస్పిటల్, సర్వీస్ అపార్ట్‌మెంట్లను నిర్మించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 200 బస్ స్టేషన్లలో థియేటర్ల ఏర్పాటు చేసే యోచన ఉందన్నారు.