ఆర్టీసీలో తాత్కాలిక విభజన
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడిగా కొనసాగుతున్న ఆర్టీసీని తాత్కాలికంగా విభజించాలని యాజమాన్యం నిర్ణయించింది. విభజన జరగకపోవటంతో సంస్థలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి స్థాయి విభజన జరిగేలోపు తాత్కాలిక విభజనతో సమస్యలు దూరం చేయాలని ఎండీ భావిస్తున్నారు. దీన్ని తొలుత ఆర్టీసీ ప్రధాన పరిపాలన కేంద్రం ఆర్టీసీ భవన్‌కు వర్తింపచేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం ఉన్న నలుగురు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్లు రెండు రాష్ట్రాల బాధ్యతను పర్యవేక్షిస్తున్నారు. ఇక నుంచి వారిలో ఇద్దరు తెలంగాణ, మిగతా ఇద్దరు ఏపీ బాధ్యతలు చూసేలా ఆయా విభాగాలను వారికి అదనపు బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు.
ఇక ఇతర విభాగాల అధిపతులను కూడా రెండు ప్రాంతాల మధ్య విభజించి ఏ రాష్ట్రానికి సంబంధించిన బాధ్యతలు ఆ రాష్ట్రం వారే చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలో ఆదేశాలు రానున్నాయి. అయితే ఈ తాత్కాలిక విభజనకు అధికారులు, కార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఒకేసారి పూర్తి విభజన జరగాలని, అందులో జాప్యం లేకుండా చూడాలని వారు పేర్కొంటున్నారు.
నేడు కార్మిక సంఘాలతో చర్చలు..
ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ, ఇతర సర్వీస్ విషయాలకు సంబంధించి గుర్తింపు పొందిన కార్మిక సంఘ కూటమి ఈయూ- టీఎంయూ నేతలతో అధికారులు సోమవారం చర్చలు జరపనున్నారు. మూడు రోజుల కిందట చర్చలు జరగాల్సి ఉన్నా... సకాలంలో అధికారులు రాకపోవటంతో కార్మిక నేతలు చర్చలను బహిష్కరించారు.