టీఎంయూ కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటుందని, వారిని ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించే వరకు పోరాటం కొనసాగుతుందని టీఎంయూ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు
బొత్స ఇచ్చిన మాట నిలుపుకోవాలి
Published Tue, Dec 3 2013 4:16 AM | Last Updated on Sat, Sep 2 2017 1:11 AM
మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్: టీఎంయూ కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటుందని, వారిని ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించే వరకు పోరాటం కొనసాగుతుందని టీఎంయూ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు అన్నారు. రాష్ట్ర రవాణాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తమకు ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్ 31 వరకు ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులను పర్మనెంటు చేయకపోతే అదేరోజు అర్ధరాత్రి నుంచే నిరవధికంగా బస్సులను నిలిపేస్తామని హెచ్చరించారు. సోమవారం జిల్లాకేంద్రంలో జరిగిన ఆర్టీసీ టీఎంయూ జిల్లా మహాసభల ముగింపు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ..ఎన్నో ఉద్యమాల ద్వారా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతుల్లో పెడితేనే ఆశించిన ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రాణత్యాగానికి సిద్ధపడటమే కాకుండా పలు సందర్భాల్లో పదవులను త్యాగం చేయించి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నిర్మించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. కొత్తరాష్ట్రంలో మన తలరాతలను మనమే మార్చుకోవాల్సిన అవసరం ఉందని, దీని కోసం ఆర్టీసీ కార్మికుల తో పాటు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర లాభపడుతుందని, తెలంగాణకే నష్టం జరుగుతుందని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఈ ప్రాంతాన్ని మరింత దోచుకోవడానికే రాయల తెలంగాణ కావాలంటున్నారని, వారి ఆటలను సాగనివ్వమన్నారు.
తెలంగాణ గడ్డమీది నుంచి
తరిమికొడతాం: శ్రీనివాస్‌గౌడ్
రాయల తెలంగాణ ప్రతిపాదన ఎవరు తెచ్చారో పాలకులు తేల్చాలని, కాంగ్రెస్ కొత్తపేచీ పెడితే ఆ పార్టీని, నేతలను ఈ గడ్డమీది నుంచి తరమికొడతామని టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మీ సోపతే బాగా లేదని మేమంటుంటే, కర్నూలు, అనంతపూర్ జిల్లాలను తెలంగాణలో కలపాలని ఆలోచించడం దుర్మార్గమన్నారు. యూపీఏ ప్రభుత్వం ఏ మాత్రం మాట తప్పినా సకల జనుల సమ్మె కంటే ఉధృత ఆందోళనలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి తెలంగాణ ఏర్పాటుపై జరుగుతున్న జాప్యాన్ని ఎండగట్టారు. అనంతరం జీఎల్‌గౌడ్ అధ్వర్యంలో ఎన్‌ఎంయూకు రాజీనామా చేసిన కార్మికులను టీఎంయూ చేర్చుకున్నారు. కార్యక్రమంలో టీఎంయూ రాష్ట్ర నేతలు అశ్వథ్థామరెడ్డి, థామస్‌రెడ్డి, తిరుపతి, టీఆర్‌ఎస్ నాయకులు ఇబ్రాహీం, గువ్వల బాలరాజు, బాలాజీ, ఇంతియాజ్ ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement