సాక్షి, అమరావతిబ్యూరో: బొండా ఉమామహేశ్వరరావు భూ దాహానికి అధికార యంత్రాంగం అడుగడుగునా అండగా నిలిచింది. రెవెన్యూ, పోలీసు శాఖలు శక్తివంచన లేకుండా సహకారం అందించినట్లు అనేక రుజువులు లభిస్తున్నాయి. వారి అండతోనే రికార్డులు తారుమారు చేసి స్వాతంత్య్ర సమరయోధునికి చెందిన రూ.50 కోట్లకు పైగా విలువైన 5.16 ఎకరాల భూమి గుప్పిట్లోకి తెచ్చుకున్నట్లు స్పష్టం అవుతోంది. ‘బొండాగిరి’కి సంబంధించి పలు కొత్త కోణాలు ‘సాక్షి’ పరిశోధనలో వెలుగుచూశాయి.
రికార్డులు లేని కాలాన్ని ఆసరాగా చేసుకుని..
1971–88 మధ్య కాలంలో భూములు, ఆస్తుల కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన విజయవాడ గాంధీనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డులు ధ్వంసమయ్యాయి. దాన్నే ఎమ్మెల్యే బొండా ఉమా తమ భూదందాలకు అవకాశంగా మలచుకున్నారు. స్వాతంత్య్రసమరయోధుడు సూర్యనారాయణ పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావు ఆ భూమిని విజయవాడకు చెందిన అబ్దుల్‌మస్తాన్, రామిరెడ్డి కోటేశ్వరరావుకు 1988లో విక్రయించినట్లు 2016లో పత్రాలు సృష్టించారు. వాస్తవానికి వారిద్దరికీ కూడా ఆ విషయం తెలీదు. అబ్దుల్ మస్తాన్ చిన్నా చితకా పనులు చేస్తూ ఉంటారు. ఇక కోటేశ్వరరావు దిగువ మధ్యతరగతికి చెందిన లారీ డ్రైవర్. అంతటి విలువైన భూములను కొనుగోలు చేసే ఆర్థికస్తోమత వారిద్దరికీ లేదు.
ఆ పత్రాలను చూపిస్తూ ఆ 5.16 ఎకరాలను అబ్దుల్ మస్తాన్, కోటేశ్వరరావు పేరిట మ్యుటేషన్ చేయాల్సిందిగా తహశీల్దార్‌కు 2016, జులై 31న దరఖాస్తు చేశారు. ఇక్కడే రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా ఎమ్మెల్యే బొండా కుటుంబానికి సహకరించింది. తహసిల్దార్ ఆ దరఖాస్తును ఓకే చేస్తూ కలెక్టర్‌కు పంపగా ఆయన ఐజీ(రిజిస్ట్రార్స్)కు నివేదించారు. ఇలా అన్ని స్థాయిల్లో సహకరించి ఆ భూములను 22ఎ నిబంధన కింద మ్యుటేషన్ చేసేయడం గమనార్హం. దరఖాస్తుదారులైన అబ్దుల్ మస్తాన్, రామిరెడ్డి కోటేశ్వరరావు తహశీల్దార్, కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లకున్నా బొండా కనుసైగతోనే అధికారులు మ్యుటేషన్ తతంగం పూర్తి చేసేశారు. అనంతరం రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తరువాత అబ్దుల్ మస్తాన్, రామిరెడ్డి కోటేశ్వరరావు 2017 మార్చి 15న ఎమ్మెల్యే బొండా ఉమా భార్య సుజాతతోపాటు మరో అయిదుగిరికి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) కింద రాసిచ్చినట్లు కథ నడిపించారు. అడంగళ్‌లోనూ పేర్లు మార్చేసి రూ.50కోట్ల విలువైన భూమి పూర్తిగా ఎమ్మెల్యే బొండా ఉమా సొంతం చేసుకున్నారు.
బొండా భూబాగోతానికి పోలీసు అండ
తమ కుటుంబానికి చెందిన 5.16 ఎకరాలకు ప్రహరీ నిర్మించి ఆక్రమించుకున్న ఎమ్మెల్యే బొండా కుటుంబాన్నిఇదేమిటని అడిగితే దౌర్జన్యానికి దిగారంటూ సూర్యనారాయణ మనవడు సురేష్ 2017, ఫిబ్రవరి 10న విజయవాడ సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన ఏసీపీ స్థాయి అధికారి ఒకరు సురేష్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. (ఎమ్మెల్యే బొండా సిఫార్సుతోనే ఆ అధికారికి పోస్టింగు దక్కిందన్న విమర్శలు ఉన్నాయి.) భూ విషయమై ఎన్నిసార్లు పోలీసులను సంప్రదించినా ఆ అధికారి బెదిరించారు. ఫిర్యాదులో అంశాలన్నీ తప్పని, మరోసారి ఈ భూమి గురించి మాట్లాడితే తప్పుడు పత్రాలు సృష్టించినట్లు కేసు పెడతానని కూడా సురేష్‌బాబును బెదిరించారు. దాంతో తనకు పోలీసులు సహకరించరని అర్థం చేసుకున్న సురేష్ సీఐడీ అధికారులను ఆశ్రయించారు. దాంతో మొత్తం ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబం భూబాగోతం వెలుగులోకి వచ్చింది.
అక్టోబరు 23న బొండా ఉమా భార్య సుజాత, ఆయన అనుచరుల మీద సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, డిసెంబర్ 4న ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబం ఆ భూమి మీద పవర్ ఆఫ్ అటార్నీని రద్దు చేసుకున్న పత్రాలు
మా తప్పిదమేమీ లేదు: రిజిస్ట్రార్ అధికారులు
ఎమ్మెల్యే బొండా కుటుంబం భూబాగోతంపై సీఐడీ కేసు నమోదు కావడంతో రిజిస్ట్రేషన్ శాఖ విచారణ చేపట్టింది. ఐజీ (రిజిస్ట్రేషన్లు) వెంకట్రామిరెడ్డి ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాసరావు ప్రాథమిక నివేదిక సమర్పించారు. ఆ భూమిపై తహశీల్దార్ చేసిన మ్యుటేషన్ ఆధారంగానే రిజిస్ట్రేషన్ చేశామని, అందులో రిజిస్ట్రార్ కార్యాలయ అధికారుల తప్పేమి లేదని నివేదించినట్లు తెలుస్తోంది.
కేసు నమోదుతో జీపీఏ రద్దు నాటకం
కేసు నమోదు కావడం, కోటేశ్వరరావు అప్రూవల్‌గా మారడంతో సీఐడీ అధికారుల కళ్లుగప్పి ఆ కేసు నుంచి బయటపడేందుకు బొండా ఉమా కుటుంబం మరో ఎత్తుగడ వేసింది. గత అక్టోబర్‌లో కేసు నమోదు కాగా డిసెంబర్ 4న జీపీఏ రద్దు చేసుకుంటున్నట్లు పత్రాలు సృష్టించారు. అంటే సీఐడీ కేసు నమోదు చేసిన తరువాతే ఆ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేశారన్నది స్పష్టమవుతోంది. సీఐడీ విచారణ నుంచి తప్పించుకునేందుకే ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబం ఈ ఎత్తుగడను ఎంచుకున్నారు. మరోవైపు అప్రూవర్‌గా మారిన కోటేశ్వరరావును బెదిరించి తమకు అనుకూలంగా మలచుకోవాలన్నది వ్యూహం. తద్వారా సీఐడీ కేసును నీరుగార్చాలని పథకం వేశారు.
అయితే ఈ చర్యతో ఆ భూమిని పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా పొందడం అక్రమమని వారే సమ్మతించినట్లవుతోంది. జీపీఏ నెల క్రితమే రద్దు చేసుకున్నట్లు చెబుతున్నా అధికారదర్పంతో భూమిని మాత్రం ఇప్పటికీ తమ గుప్పిట్లోనే పెట్టుకున్నారు. ఆ భూమి చుట్టూ ప్రహరీ నిర్మించి తమ మనుషులను కాపలా పెట్టారు. సూర్యనారాయణ కుటుంబ సభ్యులను అక్కడకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. సూర్యనారాయణ కోడలు జోగరత్నమ్మ, పెద్ద మనవడు శ్రీనివాస్ సోమవారం కూడా ఆ భూమి వద్దకు వెళితే కాపలాదారులు అడ్డుకున్నారు. సీఐడీ కేసు నీరుగార్చేవరకు నిరీక్షించి తర్వాత భూమిపై పట్టు సాధించాలన్నది ఎమ్మెల్యే కుటుంబ లక్ష్యంగా ఉంది.
సోమవారం తమ భూమిలోకి ప్రవేశించలేక బయటే ఉండిపోయిన సూర్యనారాయణ కోడలు రాజరత్నమ్మ, పెద్ద మనవడు శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment