కుందుర్పి, న్యూస్‌లైన్ : కుందుర్పి మండలం అప్పిలేపల్లిలో ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం అర్ధరాత్రి ప్రదర్శించిన వీధి నాటకం ఉద్రిక్తతకు దారితీసింది. నాటకం మధ్యలో చేస్తున్న అశ్లీల నృత్యాల ప్రదర్శన ఆపాలని ఎస్‌ఐ కోరగా.. కళాకారులు బేఖాతరు చేస్తూ కొనసాగించారు. చివరకు ఎస్‌ఐ లైట్లు ఆర్పివేయడంతో జనం స్టేజీపైకి దూసుకొచ్చారు. ఈ క్రమంలో ఒక మహిళ స్పృహ తప్పిపడిపోయింది. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన జనం పోలీసులపైకి రాళ్లు రువ్వారు.
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌కు చెందిన రెండు బైక్‌లకు నిప్పుపెట్టారు. కళ్యాణదుర్గం డీఎస్పీ వేణుగోపాల్ , సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వంశీధర్‌గౌడ్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అప్పిలేపల్లిలో ఆదివారం నిర్వహించనున్న గావు ఉత్సవానికి నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. శనివారం అర్ధరాత్రి ‘బొబ్బిలి రాముడు’ సాంఘిక నాటకం ప్రదర్శించారు. మధ్య మధ్యలో కళాకారులు అశ్లీల నృత్యాలతో రెచ్చిపోయారు. దీంతో ఎస్‌ఐ శ్రీనివాసులు, మరో పది మంది పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
అశ్లీల ప్రదర్శనలు చట్టరీత్యా నేరమని, వెంటనే ఆపేయాలని ఎస్‌ఐ సూచించారు. తాము రూ.90 వేలు వెచ్చించి నాటకం ప్రదర్శిస్తున్నామని, ఇప్పుడిలా ఆపాలంటే కుదరదని, తమకు సడలింపు ఇవ్వాల్సిందేనంటూ అశ్లీల నృత్యాలు కొనసాగించారు. ఓపిక నశించిన ఎస్‌ఐ స్టేజీపైకి వెళ్లి లైట్లు ఆర్పివేయడంతో జనం దూసుకొచ్చారు.
తొక్కిసలాటలో వడ్డే రామక్క అనే మహిళ స్పృహ తప్పి కిందపడింది. ఆగ్రహించిన జనంలో కొందరు పోలీసులపైకి ఇసుక, కంకరరాళ్లు విసిరారు. ప్రాణ భయంతో పోలీసులు అక్కడి నుంచి పరుగులు తీశారు. అప్పటికీ శాంతించని కొందరు ఆకతాయిలు ఎస్‌ఐ శ్రీనివాసులు, కానిస్టేబుల్ రామాంజనేయులు అక్కడే వదిలి వెళ్లిన రెండు బైక్‌లకు నిప్పంటించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ వేణుగోపాల్, సీఐ వంశీధర్ గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఎస్‌ఐకి, పోలీసు సిబ్బందికి రివార్డులు
అశ్లీల నృత్య ప్రదర్శనను అడ్డుకుని, శాంతిభద్రతల పరిరక్షణలో తమ వంతు పాత్ర పోషించిన కుందుర్పి ఎస్‌ఐ శ్రీనివాసులుతోపాటు పది మంది పోలీసు కానిస్టేబుళ్లకు ఎస్పీ సెంథిల్‌కుమార్ రివార్డులు ప్రకటించారు.
భయం గుప్పిట్లో అప్పిలేపల్లి
దాడి ఘటనలో 18 మందిని పోలీసులు అరెస్ట్ చేయడంతో అప్పిలేపల్లి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. బంధు, మిత్రులతో ఆనందంగా ఉండాల్సిన ఆంజనేయస్వామి రథోత్సవం నాడు పోలీసుస్టేషన్లో కాలం గడపడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అనుమానితులతో పాటు గ్రామంలోని పెద్దమనుషులను, రాజకీయ నాయకులను సహితం కళ్యాణదుర్గం సర్కిల్ కార్యాలయానికి పిలిపించి విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలతో జాతర కళ తప్పి.. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
20 మందిపై కేసు... 18 మంది అరెస్ట్
కళ్యాణదుర్గం రూరల్ : కుందుర్పి మండలం అపిలేపల్లి గ్రామంలో పోలీసులపై దాడి చేసిన ఘటనలో ఓంకార్, తిమ్మరాజులు, చిరంజీవి, నాగరాజు, తిమ్మప్పతో సహా 20 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వంశీధర్‌గౌడ్ తెలిపారు. వీరిలో 18 మందిని అరెస్ట్ చేశామన్నారు. ఈ విషయాన్ని ఆదివారం కళ్యాణదుర్గం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులకు వెల్లడించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడిచేశారన్న అభియోగంపై కేసు నమోదు చేశామని, నిందితులను రిమాండ్‌కు పంపించామని తెలిపారు.
అప్పిలేపల్లిలో ఉద్రిక్తత
Published Mon, Feb 17 2014 2:56 AM | Last Updated on Sat, Jun 2 2018 8:47 PM
Advertisement
Advertisement