సాక్షి, ఉంగుటూరు: ప్రజాభిమానమే పెట్టుబడిగా, నిత్యం ప్రజలలోనే ఉంటూ, వారి సమస్యలపై పోరాడుతూ ప్రజాసంక్షేమమే అజెండాగా దూసుకుపోతున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంగుటూరు నియోజకవర్గ అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు). పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకువెళ్లడంతోపాటు ప్రచారంలోనూ దూసుకుపోతున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన ఆయన తన అంతరంగాన్ని ‘సాక్షి’ ఎదుట ఆవిష్కరించారు.
ప్రశ్న: మీ వ్యక్తిగత వివరాలు
వాసుబాబు : మాది నిడమర్రు మండలం బువ్వనపల్లి. 1967లో భూస్వామ్య జమీందారి కుటుంబంలో జన్మించా. ఇంటర్ వరకు చదివాను. ఆక్వా చెరువులు, రైస్‌మిల్లులు, సినిమా థియేటర్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నా. నాకు భార్య, ఇద్దరు కుమార్తెలు. మాతాత, తండ్రి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను. 2006లో బువన్నపల్లి సర్పంచ్‌గా పోటీచేసి గెలుపొందారు. 2012లో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరాను. 2014 ఎన్నికల్లో ఉంగుటూరు నుంచి పోటీచేసి స్వల్పతేడాతో ఓటమిపాలయ్యా.
ప్రశ్న : 2014లో ఓటమి ఎలా అనిపించింది
వాసుబాబు : 2014 ఎన్నికలల్లో ఓటమి నాకన్నా పార్టీ కార్యకర్తలు, అభిమానులను బాగా నిరుత్సాహానికి గురిచేసింది. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచే సీట్లలో ఉంగుటూరు ఒకటని బాగా ప్రచారం జరిగింది. అన్నిరకాల అంచనాలు మా పార్టీకే అనుకూలంగా ఉన్నా చంద్రబాబు అబద్ధపు హామీలను నమ్మిన రైతులు, మహిళలు తెలుగుదేశం వైపు మొగ్గుచూపడంతో స్వల్పతేడాతో ఓడిపోయాను.
ప్రశ్న : ఇప్పుడు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి
వాసుబాబు : ఉంగుటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు దాదాపు ఖాయం. జగన్ ప్రకటించిన నవరత్నాలు, బీసీ డిక్లరేషన్, వివిధ వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలు పార్టీ విజయావకాశాలను బాగా పెంచాయి. దీనికి తోడు తెలుగుదేశం పార్టీ అరాచకపాలన, జన్మభూమి కమిటీల దోపిడీ, ఇసుక, మట్టితో సహా సర్వం అవినీతిమయం కావడంతో ప్రజలు జగన్‌కు అధికారం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
ప్రశ్న : మీరు గెలిస్తే ఏం చేస్తారు
వాసుబాబు : నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు స్వచ్ఛ తాగునీరు అందించే కార్యక్రమాన్ని చేపడతాను. అంతర్గత రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ సదుపాయం, అర్హులందరికీ ఇళ్లస్థలాలు, ప్రభుత్వ గృహాలు మంజూరుకు ప్రాధాన్యత ఇస్తాను. చంద్రబాబు కారణంగా కొల్లేరులో జీవనోపాధి కోల్పోయిన మత్య్సకార కుటుంబాలకు జీవనోపాధి కల్పనకు ప్రాధాన్యమిస్తా. ముఖ్యంగా అవినీతిరహిత పాలన అందిస్తాను.
ప్రశ్న : వైఎస్సార్ సీపీలోకి ఎలా వచ్చారు
వాసుబాబు : మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు, ఆయన పాలన నన్నెంతో ఆకట్టుకుంది. వైఎస్సార్ అకాల మరణం, రాష్ట్రంలో పాలన గాడితప్పడం, జగన్‌పై కక్ష సాధింపులు, సమైక్యాంధ్ర కోసం
జగన్ చేసిన పోరాటంతో జగన్ వెంట నడవాలని నిర్ణయించుకున్నా. 2012లో వైఎస్సార్ సీపీలో చేరా. అప్పటినుంచి నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేస్తున్నా.
ప్రశ్న : ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది
వాసుబాబు : నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి మంచి సానుకూలత ఉంది. ప్రజలు చంద్రబాబు అబద్ధపు హామీలతో ఎలా నష్టపోయామో గ్రహించారు. అందుకే నిను నమ్మంబాబూ అంటూ చేపట్టిన కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. ఎన్నికలకు నెలరోజుల ముందు మాత్రమే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకురావడాన్ని అంతా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment