సమైక్యాంధ్ర ఉద్యమం ఈ అర్ధరాత్రి నుంచి కొత్త రూపు సంతరించుకుంటోంది. పన్నెండు రోజులుగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే సోమవారం అర్ధరాత్రి నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ(కొన్ని మినహాయింపు), కార్మిక సంఘాలతో పాటు విద్యార్థులు సకలజనుల సమ్మెకు పిలుపునిచ్చారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : సమైక్యాంధ్ర ఉద్యమం ఈ అర్ధరాత్రి నుంచి కొత్త రూపు సంతరించుకుంటోంది. పన్నెండు రోజులుగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే సోమవారం అర్ధరాత్రి నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ(కొన్ని మినహాయింపు), కార్మిక సంఘాలతో పాటు విద్యార్థులు సకలజనుల సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో జిల్లాలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోనుంది. రవాణా వ్యవస్థకు బ్రేక్ పడినట్టే. లారీ యజమానులు, ట్రక్ ఆటోలు, ఆటోయూనియన ్ల నాయకులు, సిటీ బస్సుల యజమానులు తొలిరోజు బంద్‌లో పాల్గొననున్నారు.
పలు ప్రభుత్వశాఖల సేవలు కూడా నిలిచిపోనున్నాయి. ఇప్పటికే అంతంతమాత్రంగా నడుస్తున్న ప్రభుత్వ కార్యాలయాలు ఇక పనిచేసే అవకాశాలు లేవు. ఈ సమ్మెకు కొన్ని ఉపాధ్యాయ సంఘాలు దూరంగా ఉంటున్నప్పటికీ పాఠశాలలు మూతపడనున్నాయి. ఆదివారం ఉదయం నెల్లూరులో సమావేశమైన 13 సీమాంధ్ర జిల్లాల్లోని 14 యూనివర్సిటీల విద్యార్థి జేఏసీ నేతల రౌండ్ టేబుల్ సమావేశంలో కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 13న బంద్‌కు పిలుపునివ్వగా, 14న సమైక్యాంధ్రకు అనుకూలంగా సంతకాల సేకరణ, 15న రహదాదాలు దిగ్బంధం, 16న ర్యాలీలు, 17న ప్రజప్రతినిధులు, ప్రజాసంఘాలతో సమావేశాలు, 18న కేంద్రప్రభుత్వ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా 19న కడపలో మరోసారి విద్యార్థి జేఏసీ నేతలు సమావేశమై తదుపరి కార్యాచరణ ప్రకటిస్తారు. ఆదివారం జరిగిన సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, టీడీపీ జిల్లా అధ్యక్షులు మేరిగ మురళీధర్, చాట్ల నరసింహారావు, బీద రవిచంద్ర హాజరై సంఘీభావం ప్రకటించారు. ఉద్యమానికి సంపూర్ణ మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు.
బంద్‌కు వ్యాపార, వాణిజ్య సంఘాల మద్దతు
సకల జనుల సమ్మెలో భాగంగా ఈ నెల 13న జరిగే బంద్‌కు వ్యాపార, వాణిజ్య వర్గాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఆ రోజున వ్యాపార లావాదేవీలను స్వచ్ఛందంగా నిలపివేస్తున్నట్టు వెల్లడించాయి. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా సినిమాల ప్రదర్శన, హోటళ్లు, దుకాణాలు, పరిశ్రమలు కూడా మూసివేయనున్నారు.
మూడు రోజులు ప్రైవేటు
పాఠశాలల మూత
సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ఈ నెల 13 వతేదీ నుంచి మూడు రోజు లపాటు జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు మూసివేస్తున్నట్టు ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చాట్ల నరసింహారావు తెలిపారు. విద్యార్థుల చదువులను దృష్టిలో ఉంచుకు ని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
సమ్మెలోకి 3000 మంది
ఆర్టీసీ కార్మికులు
జిల్లాలో పనిచేస్తున్న మూడు వేల మంది ఆర్టీసీ కార్మికులు 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే సకల జనుల సమ్మెలో పాల్గొననున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు నడిచే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో పది డిపోలకు సంబంధించి 970 బస్సులు నడుస్తున్నాయి. ఈ బస్సుల ద్వారా ఆర్టీసీకి ప్రతిరోజూ రూ.90 లక్షలు ఆదాయం వస్తోంది. ఆర్టీసీ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నట్టయితే ఆదాయానికి భారీగా గండిపడనుంది.
ప్రధాన పార్టీల ఆందోళనలు
సకల జనుల సమ్మెకు మద్దతుగా 12వ తేదీ నుంచి ప్రధాన రాజకీయపార్టీలు తమ ఆందోళనలను ముమ్మరం చేస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే ముందంజలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఎక్కడిక్కడ పార్టీ పరంగా ఆందోళనలు జరిపేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. సమైక్యాం ధ్ర ఉద్యమంలో అయోమయంలో ఉ న్న కాంగ్రెస్, టీడీపీలు ఉనికి కోల్పోకుండా ఉండేందుకు సకల జనుల స మ్మెలో పాల్గొనేందుకు సిద్ధమయ్యాయి. కాగా సోమవారం ఉద్యోగులు, ఎన్జీవోల ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో మహాప్రదర్శన నిర్వహించనున్నారు.