
జగన్ నాయకత్వంలో రాష్ట్ర సమైక్యత: గాదె
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నానని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి పేర్కొన్నారు.
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నానని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి పేర్కొన్నారు. జగన్ రాకతో సమైక్యోద్యమం మరింత బలపడుతుందని, ఆయన తన శక్తియుక్తులన్నిటినీ ధారపోసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రం సమైక్యంగా ఉంటుందన్న నమ్మకముందన్నారు. గాదె మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర విభజనకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డే కారణమన్న కొందరి విమర్శలు అవాస్తవమన్నారు. ఆయన పూర్తిగా సమైక్యవాది అని, తొలి నుంచీ సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నారని గుర్తు చేశారు. 2001లో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాష్ట్ర విభజన కోసం సోనియాకు లేఖ ఇప్పించింది వైఎస్సే అనడం కూడా శుద్ధ అబద్ధమన్నారు.
‘‘వైఎస్ ఉండి ఉంటే రాష్ట్రానికి ఈ దుర్గతి వచ్చేది కాదు’’ అని ఆవేదన వ్యక్తపరిచారు. జగన్ బెయిల్‌పై కొందరు దుర్మార్గమైన విమర్శలు చేస్తుండటం బాధాకరమన్నారు. ‘‘కాంగ్రెస్‌తో కుమ్మక్కైనందుకో, ప్రలోభపడ్డందుకో బెయిల్ వచ్చిందని కొన్ని పార్టీలు సత్యదూరమైన విమర్శలు చేస్తున్నాయి. జగన్‌కు అర్హత ప్రకారం బెయిల్ వచ్చిందే తప్ప మరోటి కాదు. ఆయనపై పెట్టిన క్విడ్ ప్రో కో కేసులు నిరాధారం’’ అని పేర్కొన్నారు.