ముస్తాబు
వేసవి సాయంత్రాలలో మల్లెల గుబాళింపులే కాదు వేడుకల వాతావరణమూ ఆహ్లాదపరుస్తూ ఉంటుంది. చిన్నాపెద్దా గెట్ టు గెదర్‌లు, పాశ్చాత్యశైలి పార్టీలు ఇప్పుడు మన సంస్కృతిలో భాగమైపోవడంతో పార్టీకి తగ్గ వేషధారణ కూడా ముఖ్యమైంది. కొత్త కొత్త ఫ్యాషన్ల కోసం వెతుకులాట సాధారణమైంది.కొంచెం పాశ్చాత్యం... ఇంకొంచెం సంప్రదాయం... రెండింటి మేళవింపును ఇష్టపడే యువతరం కోరుకునే దుస్తుల పరిచయమే ఈ ముస్తాబు.
1- ఎరుపు, పువ్వుల కాంబినేషన్‌లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ పొడవాటి గౌన్ బర్త్ డే, వీకెండ్ పార్టీలలో అదుర్స్ అనిపిస్తుంది. కింద పువ్వుల ప్రింట్లు ఉన్న క్రేప్ మెటీరియల్‌ను ఉపయోగించారు. నడుము, పై భాగాన్ని కలుపుతూ కర్దానా బెల్ట్‌ను ఉపయోగించారు. పైన వి నెక్ ఉన్న బ్లౌజ్‌కు ఎరుపు రంగు షిఫాన్ ఫ్యాబ్రిక్‌ను వాడారు.
2- వారాంతపు పార్టీలో చూపులను కట్టిపడేసే పొడవాటి గౌన్ ఇది. స్కర్ట్ భాగానికి షిఫాన్ ఫ్యాబ్రిక్, బ్లౌజ్ భాగానికి బ్లాక్ వెల్వెట్ వాడారు. నడుము భాగాన్ని చుట్టి ఉన్న బెల్ట్‌పై శాటిన్ రిబ్బన్‌తో వర్క్ చేశారు.
3- సాయంకాలం పార్టీని ఆహ్లాదపరిచే రంగుల కలబోత ఈ లాంగ్ గౌన్ ప్రత్యేకత. జైపూర్ ప్రింట్ ఉన్న ఇక్కత్ సిల్క్, పైన ప్లెయిన్ షిఫాన్‌కు క్రాస్ షేప్ తీసుకువచ్చారు. బ్లౌజ్ పార్ట్‌కు ఇక్కత్ సిల్క్ వాడారు. స్కర్ట్ భాగంలో వాడిన ప్రింటెడ్ క్లాత్‌తో ఫ్లవర్‌ను తీర్చిదిద్ది, భుజం దగ్గర బ్రోచ్‌లా అమర్చారు.
4- మయూరాన్ని తలపించే నీలం రంగు పొడవాటి గౌన్ పార్టీలో ప్రత్యేకంగా నిలుస్తుంది. తెల్లటి షిఫాన్ క్లాత్‌కు డై చేయించి, పీకాక్ కలర్ తెప్పించారు. బ్లౌజ్ భాగాన్ని రాసిల్క్ చెక్స్ మెటీరియల్‌తో డిజైన్‌చేశారు. సైడ్స్ పర్పుల్ ఫ్యాబ్రిక్‌వాడారు.
5- తెల్లటి పొడవైన ఈ గౌను సాయంకాలపు పుట్టిన రోజు, పెళ్లిరోజు పార్టీలకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. క్రింది భాగానికి మూడు లేయర్లుగా తెల్లని నెట్ మెటీరియల్ వాడి, లైనింగ్ కోసం శాటిన్ క్లాత్‌ను జత చేశారు. పైన హై కాలర్ నెటెడ్ బ్లౌజ్‌కి క్యాప్ స్లీవ్స్ ఇచ్చి యాంటిక్ బీడ్స్, వైట్ గోల్డ్, రాక్ గోల్డ్ సీక్వెన్స్‌తో మొత్తం ఫ్లోరల్ డిజైన్ చేశారు.
6- సాయంకాలం సంగీత్, మెహెందీ, రిసెప్షన్ వంటి సంప్రదాయ వేడుకలకు ఈ ఎర్రటి పొడవాటి గౌన్ ఎందరిలో ఉన్నా ఇట్టే ఆకట్టుకుంటుంది. క్రింది భాగాన్ని మూడు లేయర్లుగా ఎక్రటి నెట్ మెటీరియల్ వాడి, లైనింగ్ కోసం శాటిన్ క్లాత్‌ను జత చేశారు. పైన బ్రొకేడ్ క్లాత్‌తో డిజైన్ చేసిన బ్లౌజ్, బోట్ నెక్ ఇచ్చి, కుడి భుజం పైన జర్దోసి వర్క్, గ్రీన్ స్టోన్స్‌తో మెరిపించారు. నడుము భాగంలో ఎరుపురంగు సిల్క్ మెటీరియల్‌తో చేసిన బెల్ట్‌ను జత చేశారు.
పార్టీలో గ్రాండ్‌గా..:
పాశ్చాత్య దుస్తులు ధరించినప్పుడు మేకప్ మరీ ఎక్కువ కాకూడదు. మేకప్ కనిపించీ కనిపించనట్టు ఉండాలి
కేశాలంకరణ సంగతికొస్తే - హై పోనీతో కానీ, జుట్టు పూర్తిగా వదిలేయడం కానీ చేయాలి. సమకాలీన లుక్ ఉండేలా చూసుకోవాలి
గౌన్‌లు వేసుకున్నప్పుడు హై హీల్స్, శాండల్స్ బాగా నప్పుతాయి
డ్రెస్‌కు సంబంధం లేనట్టు కాకుండా యాక్ససరీస్ మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి హ్యాండ్‌బ్యాగ్ బదులు క్లచ్ లాంటివి పట్టుకుంటే లుక్ బాగుంటుంది.
కర్టెసి: భార్గవి కూనమ్
ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్
www.bar9999@gmail.com
సంజె కాంతుల్లో...సౌందర్య రాగం!
Published Wed, May 21 2014 10:44 PM | Last Updated on Fri, Mar 22 2019 6:28 PM
Advertisement
Advertisement