విభజనకు బాబు చీకటి ఒప్పందం
ఏలూరు, న్యూస్‌లైన్ : రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే 20ఏళ్ళపాటు తమ పార్టీల భవిష్యత్తు అంధకారంలో మగ్గిపోతుందనే భయంతోనే సోనియాగాంధీ, చంద్రబాబు చీకటి ఒప్పందాలు చేసుకుని రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కుట్ర పన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ళనాని పేర్కొన్నారు. వైఎస్ జగన్ నిరవధిక దీక్ష భగ్నానికి నిరసనగా ఏలూరులో ఆళ్ళనాని చేపట్టిన రెండు రోజుల మౌన నిరాహార పాదయాత్ర చివరి రోజైన ఆదివారం నగర ప్రజలు నీరాజనాలు పలికారు.
ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ సుమారు 18 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు డప్పులు, వాయిద్యాలతో పెద్దెత్తున పాల్గొన్నారు. ఏలూరులోని 21డివిజన్లలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఏర్పాటు చేసిన నిరాహారదీక్ష శిబిరాలను ఆయన పాదయాత్రగా వెళ్ళి సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. పాదయాత్ర ముగింపు సభలో ఆళ్ళనాని మాట్లాడుతూ సీమాంధ్ర ప్రాంతంలో కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా ప్రజలంతా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారని, దీనికి భిన్నంగా వ్యవహరిస్తే క్షమించరని హెచ్చరించారు. సీమాంధ్ర ప్రజల కష్టంతో హైదరాబాద్‌ను అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దితే ఇప్పుడు తెలంగాణకు ఇచ్చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.