సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా మంగళవారం మధ్యాహ్నం సీమాంధ్ర న్యాయవాదులు మౌనదీక్ష చేపట్టగా.. దానిని అడ్డుకునేందుకు తెలంగాణ న్యాయవాదులు ప్రయత్నించటంతో.. హైకోర్టులో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. గత వారం జరిగిన ఘర్షణ నేపథ్యంలో.. ఈసారి పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టటంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణ తప్పింది. రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా హైకోర్టులో భోజన విరామ సమయంలో బార్ కౌన్సిల్ ఎదుట మౌనదీక్ష నిర్వహించేందుకు దాదాపు 300 మంది సీమాంధ్ర న్యాయవాదులు బార్ కౌన్సిల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వారిలో కొందరు జై సమైక్యాంధ్ర నినాదాలు చేయగా.. ఆ దగ్గర్లోనే ఉన్న తెలంగాణ న్యాయవాదులు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు.
దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై రోప్ పార్టీల సాయంతో ఇరుపక్షాల న్యాయవాదులు పరస్పరం ఎదురుకాకుండా అడ్డుకున్నారు. మౌనదీక్షలో పాల్గొనటానికి కిందకు వస్తున్న సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ చైర్మన్ సి.వి.మోహన్‌రెడ్డిని, మరికొందరు న్యాయవాదులను అరెస్ట్ చేసి ఫలక్‌నుమా స్టేషన్‌కు తీసుకెళ్లారు. తెలంగాణ న్యాయవాదుల్లో కొందరిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎ.గిరిధరావు అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేయగా.. దీనిని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు.. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. దీంతో సాయంత్రం నాలుగు గంటలకు న్యాయవాదులను పోలీసులు హైకోర్టుకు తీసుకువచ్చి విడిచిపెట్టారు. ఇదిలావుంటే.. సెప్టెంబర్ 6న సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణ న్యాయవాదులు జరిపిన దాడిని రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం, రాష్ట్ర బార్ కౌన్సిల్ ఖండించాయి.
హైకోర్టులో ఉద్రిక్తత
Published Wed, Sep 11 2013 2:38 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement