పార్లమెంటు ఆవరణలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మంగళవారం పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరసనలో పాల్గొన్న వారిలో పార్లమెంటు సభ్యులు కాని వారిని గుర్తించి, అక్కడి నుంచి పంపించేందుకు భద్రతా సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఉదయం పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావటానికి అరగంట ముందు ప్రారంభమైన ఈ నిరసన కార్యక్రమం గంటన్నర పాటు కొనసాగింది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలనే డిమాండ్‌తో పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవటం కోసం ఢిల్లీ వెళ్లి జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తామని కాంగ్రెస్ సీమాంధ్ర నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. వ్యూహాత్మకంగా కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యుల ద్వారా పార్లమెంటు సెంట్రల్ హాల్‌ను సందర్శించేందుకు అనుమతిపత్రాలు సంపాదించిన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పార్లమెంటు ప్రాంగణంలోకి ప్రవేశించి గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. దాదాపు డజను మంది రాష్ట్ర మంత్రులు, రెండు డజన్ల మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బైఠాయించారు.
వారిచుట్టూ పార్లమెంటు సభ్యులు వలయంగా నిలబడటంతో ఎంపీలు కానివారిని గుర్తించి అక్కడి నుంచి పంపించటం భద్రతా సిబ్బందికి సాధ్యపడలేదు. కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, చిరంజీవి, ఎం.ఎం.పల్లంరాజు, దగ్గుబాటి పురందేశ్వరి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, పనబాక లక్ష్మి, జె.డి.శీలం, కిల్లి కృపారాణి, ఎంపీలు కె.వి.పి.రామచంద్రరావు, లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎ.సాయిప్రతాప్, అనంత వెంకట్రామిరెడ్డి, కనుమూరి బాపిరాజు, టి.సుబ్బిరామిరెడ్డి, బొత్స ఝాన్సీ, చింతా మోహన్, రాష్ట్ర మంత్రులు శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు, సి.రామచంద్రయ్య, ఏరాసు ప్రతాపరెడ్డి, పి.బాలరాజు, కాసు వెంకటకృష్ణారెడ్డి, మహీధరరెడ్డి, శత్రుచర్ల విజయరామరాజు, కొండ్రు మురళి, అహ్మదుల్లాలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆందోళన విరమించిన నేతలంతా సెంట్రల్ హాల్‌లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించారు. పార్టీ అధిష్టానం నియమించిన ఆంటోని కమిటీ నుంచి పిలుపు వచ్చినప్పుడే మరోసారి చర్చలకు రావాలని, ఈ లోగా అధిష్టానం ప్రతినిధులెవరినీ కలుసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అభిప్రాయపడినట్లు తెలియవచ్చింది.
‘పెద్దల’ హెచ్చరికలతో వెనుకడుగు!
పార్లమెంట్ ఆవరణలో నిరసన కార్యక్రమానికి ముందు కాంగ్రెస్ సీమాంధ్ర ప్రాంత నేతలంతా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇంట్లో అల్పాహార విందు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముందే పార్టీ అధిష్టానం పెద్దలు ఒకరిద్దరు సీమాంధ్ర ముఖ్య నేతలకు ఫోన్ చేసి ధర్నా కార్యక్రమాన్ని విరమించుకోవాలని గట్టిగానే చెప్పటంతో వారంతా పునరాలోచనలో పడ్డారు. ఈ దృష్ట్యా పార్లమెంటులో నిరసన కొనసాగించటమా, రాజ్‌ఘాట్ గాంధీ సమాధి వద్ద మౌనదీక్షకు దిగటమా? అన్న దానిపై నేతలు తర్జనభర్జన పడ్డారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ ప్రాంత ఎంపీలు, నేతలు పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగి తమ ప్రజల అభిప్రాయాలను కేంద్రం ముందుంచే ప్రయత్నం చేశారని, అలాగే తమ ఆందోళనను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.