క్రమబద్ధీకరణ కుదరదు! | Shock for 50 thousand outsourcing and contract employees | Sakshi
Sakshi News home page

క్రమబద్ధీకరణ కుదరదు!

Published Wed, Jun 13 2018 3:52 AM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

Shock for 50 thousand outsourcing and contract employees - Sakshi

సాక్షి, అమరావతి: గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని తుంగలో తొక్కుతూ, న్యాయపరమైన అంశాలను సాకుగా చెబుతూ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం మాట మార్చింది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది క్రమబద్ధీకరణ కుదరదని తేల్చేసింది! రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న దాదాపు 50 వేల మంది కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది. ఈ అంశం ముగిసిన అధ్యాయమని, దీని గురించి ఇక ఆలోచించాల్సిన అవసరం లేదని తాజాగా జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో నిర్ణయించారు. 2014 ఎన్నికల సందర్భంగా తమను దశలవారీగా క్రమబద్ధీకరణ చేస్తామంటే చంద్రబాబు ఓటు వేశామని, కానీ ఇప్పుడు మాట మార్చి కుదరదని చెప్పడం దుర్మార్గమని కాంట్రాక్టు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ తమకు హామీ ఇచ్చే నాటికే కోర్టుల్లో కేసులు ఉన్నాయని, ఆ విషయం తెలిసి కూడా  తమను క్రమబద్ధీకరిస్తామనే హామీని ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. 

మంత్రులు యనమల, కాల్వ భేటీలో నిర్ణయం
సోమవారం నిర్వహించిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం సందర్భంగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ గురించి ఇక చర్చించాల్సిన అవసరం లేదని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, గృహనిర్మాణ శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు నిర్ణయించినట్లు తెలిసింది. ఇతర సమస్యలు ఇంకా ఏమైనా ఉంటే చర్చించాలని, క్రమబద్ధీకరణపై ఇక ఆలోచించాల్సిన పనిలేదనే నిర్ణయానికి వచ్చారు. 

అలాంటప్పుడు 16 సార్లు భేటీ ఎందుకు?
ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 50 వేల మంది దాకా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులున్నారు. అసలు కాంట్రాక్టు విధానాన్ని అమల్లోకి తెచ్చిందే చంద్రబాబు నాయుడు. మరి ఇప్పుడు వారిని క్రమబద్ధీకరించడానికి ఏ కేసు అడ్డొస్తోందో, న్యాయపరమైన చిక్కులు ఎక్కడ ఎదురవుతున్నాయో రాష్ట్ర ప్రభుత్వం చెప్పటం లేదు. ఎన్నికలకు ముందు ఈ కేసులు, కోర్టుల్లో వ్యాజ్యాల గురించి చంద్రబాబుకు తెలియదా? అని ఉద్యోగులు మండిపడుతున్నారు. కేసులున్నాయంటున్న మంత్రివర్గ ఉపసంఘం మరి క్రమబద్ధీకరణ అంశంపై 16 సార్లు ఎందుకు భేటీ అయిందో చెప్పాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

క్రమబద్ధీకరణపై కోర్టులు ఏమన్నాయంటే..
సుప్రీంకోర్టు: క్రమబద్ధీకరణకు సంబంధించి ఉమాదేవి వర్సెస్‌ కర్నాటక గవర్నమెంట్‌ విషయంలో గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. శాంక్షన్డ్‌ (మంజూరు) పోస్టులు అయి ఉండి, అర్హత ప్రకారం నియమించి, 10 సంవత్సరాలు పనిచేసి ఉంటే వారందరినీ క్రమబద్ధీకరించవచ్చని తెలిపింది. రాజ్యాంగబద్ధంగా విధి విధానాలు పాటించిన ఉద్యోగాలు క్రమబద్ధీకరణ హక్కు కలిగి ఉంటాయని సుప్రీంకోర్టు చెప్పింది.

రాజస్థాన్‌ హైకోర్టు: క్రమబద్ధీకరణకు సంబంధించి రాజస్థాన్‌లో ఏఎన్‌ఎంలు (డబ్లు్యపీ నెం.2329/2014) హైకోర్టును ఆశ్రయించారు. వైద్య అధికారులు ఇచ్చిన ప్రకటనల మేరకు దరఖాస్తు చేసుకుని, మెరిట్‌ ప్రాతిపదికన నియామకం చేసి ఉంటే వారిని క్రమబద్ధీకరించాలని కోర్టు సూచించింది.

బాంబే హైకోర్టు: మహారాష్ట్రలో కొంతమంది కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్ధీకరణ విషయంలో బాంబే హైకోర్టు (డబ్లు్యపీ నెం.2046/10)ను ఆశ్రయించగా... మూడేళ్ల పాటు పనిచేసిన ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆదేశించింది.

ఏపీ ఉమ్మడి హైకోర్టు: 2010 నవంబర్‌ 2న ఉమాదేవి వర్సెస్‌ సుప్రీం కోర్టు కేసును పరిగణనలోకి తీసుకుంటూ.. బీసీ సంక్షేమశాఖలో పదేళ్లు అనుభవం పూర్తిచేసుకున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఏపీ ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement