శింగనమల మండలంలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో సూర్యప్రతాపం కొనసాగుతోంది. ప్రజలు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. వైశాఖం ముగిసిన తరువాత భానుడు భగ్గుమనడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉష్ణోగ్రతలు 40 నుంచి 46 డిగ్రీలు నమోదవుతుండటంతో ‘అనంత’ వేడెక్కిపోయింది. పట్టణాల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారుతుండగా ఎండవేడికి గ్రామీణ ప్రాంతాలు అల్లాడుతున్నాయి. శనివారం కూడా శింగనమల మండలం తరిమెలలో 45.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.
యాడికి, కళ్యాణదుర్గం మండలాల్లో వడదెబ్బతో ముగ్గురు మృత్యువాతపడ్డారు. చిన్నారులు, వృద్ధులు, రోజువారీ కష్టజీవులు, ఉపాధి కూలీలు ఉక్కపోతకు సొమ్మసిల్లిపోతున్నారు. మొత్తమ్మీద సూర్యప్రతాపంతో ‘అనంత’ ఉడికిపోతోంది. శింగనమల మండలంలో 45.2 డిగ్రీలు, యల్లనూరు 42.6 డిగ్రీలు, అనంతపురం 42.3 డిగ్రీలు, పామిడి 42.3 డిగ్రీలు, కూడేరు 42.1 డిగ్రీలు, యాడికి, ఆత్మకూరు 42 డిగ్రీలు, పుట్లూరు, విడపనకల్ 41.9 డిగ్రీలు, కళ్యాణదుర్గం 41.7 డిగ్రీలు, తాడిమర్రి, పెద్దవడుగూరు 41.4 డిగ్రీలు, రొద్దం 41.3 డిగ్రీలు, రాయదుర్గం 41.2 డిగ్రీలు, పెద్దపప్పూరు, నార్పల 41.1 డిగ్రీలు, ఉరవకొండ, తనకల్లు 41 డిగ్రీలు మేర నమోదు కాగా తక్కిన మండలాల్లో 38 నుంచి 40 డిగ్రీల మేర వేసవితాపం కొనసాగింది.
కనిష్ట ఉష్ణోగ్రతలు 27 నుంచి 29 డిగ్రీలుగా నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం పూట 60 నుంచి 70 శాతం ఉండగా మధ్యాహ్న సమయానికి 20 నుంచి 30 శాతానికి పడిపోయాయి. మరికొద్ది రోజులు వేసవితాపం కొనసాగే అవకాశం ఉన్నందున వడదెబ్బ సోకకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
సూర్య @ 45.2
Published Sun, May 24 2015 3:54 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 AM
Advertisement